http://www.prajasakti.com/./mm/20200525//1590386073.balbeersingh.jpg

భారత్‌ హాకీ దిగ్గజం బల్బీర్‌సింగ్‌ కన్నుమూత

ఛండీఘడ్‌: భారత హాకీ దిగ్గజం బల్బీర్‌సింగ్‌(95) కన్నుమూశారు. మెదడు సంబంధ వ్యాధితో మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడుసార్లు స్వర్ణపతకాలు తీసుకురావడంలో బల్బీర్‌సింగ్‌ కీలకపాత్ర పోషించారు. మే 8వ తేదీనే బల్బీర్‌ను ఆసుపత్రిలో చేర్పించారని, చికిత్స అందించినా ఇప్పటి వరకు కోలుకోని బల్బీర్‌...ఈరోజు మరింతగా ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆధునిక ఒలింపిక్‌ చరిత్రలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ప్రకటించిన 16 మంది దిగ్గజాలలో బల్బీర్‌ ఒకరు. భారతీయులలో ఏ అథ్లెట్‌కు దక్కని గౌరవం బల్బీర్‌కు దక్కింది. అలాగే ఒలింపిక్స్‌ హాకీ ఫైనల్స్‌ చరిత్రలో 1952లో నెదర్లాండ్స్‌తో తలపడిన మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత గోల్స్‌ రికార్డును బల్బీర్‌ సాధించారు. ఈ రికార్డు ఇప్పటికీ ఆయన పేరుపైనే ఉంది. 1948, 1952, 1956లలో భారత జట్టు ఒలింపిక్‌ స్వర్ణాలు గెలవడంలో బల్బీర్‌ కీలక పాత్ర పోషించారు. 1957లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది.