ఒక్కరోజులో 6,767 కేసులు
- భారత్‌లో పంజా విసురుతున్న కరోనా రక్కసి
- గత 24 గంటల్లో 147 మంది బాధితులు మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్‌డౌన్ అమల్లో ఉండగానే పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కేసుల విషయంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. వరుసగా మూడో రోజు భారీగా కేసులు బయటపడ్డాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. కేవలం ఒక్కరోజు వ్యవధిలో ఏకంగా 6,767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కరోనా ఆనవాళ్లు బయటపడిన తర్వాత ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం.
అలాగే గత 24 గంటల్లో 147 మంది కరోనా బాధితులు మరణించారు. అంటే గంటకు ఆరుగురు మృతి చెందినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 1,31,868కు, మరణాలు 3,867కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 73,560కి ఎగబాకాయి. 54,440 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 41.28 శాతానికి చేరడం కొంత సానుకూలాంశంగా మారింది.
రాబోయే 2 నెలలు అత్యంత కీలకం
ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత ఇప్పటికే అధికంగా ఉన్న ప్రాంతాల్లో రాబోయే రెండు నెలలు అత్యంత కీలకమని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మరింత పెంచుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆక్సిజన్ వసతితో కూడిన ఐసోలేషన్ బెడ్లు, వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 70 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని 11 మున్సిపాల్టీలు/కార్పొరేషన్లలోనే బయటపడ్డాయని తెలియజేసింది. ఆయా ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, జనసాంద్రత అధికంగా ఉన్నచోట ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీ సుదాన్ శనివారం 11 మున్సిపాల్టీలు/కార్పొరేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణకు స్క్రీనింగ్ పరీక్షలు అధికంగా నిర్వహించాలని ఆదేశించారు.