హస్తినకు వెళ్తున్నా అని కోర్టుకి డుమ్మా కొట్టిన జగన్
by Sridhar Raavi, By Mirchi9ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. సిబిఐ, ఈడీకి సంబంధించిన కేసులలో హాజరు కాకుండా ముఖ్యమంత్రి జగన్ ఆబ్సెంట్ పిటిషన్ వేశారు. ఏ1 నిందితుడిగా ఉన్న ఏపీ సీఎం జగన్ ఈరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు రాలేకపోతున్నారని న్యాయమూర్తికి ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు.
దీనికి న్యాయమూర్తి అంగీకరించారు. అలాగే ఏ2గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు గైర్హాజరయ్యారు. అయితే తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, రాజగోపాల్, మరో ఇద్దరు నిందితులు కోర్టుకు హాజరయ్యారు. ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జగన్ ఒక్కసారి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు.
అయితే ప్రతీ వారం ఏదో ఒక కారణం చూపుతూ జగన్ కోర్టుకు హాజరుకాకపోవడంపై ఇప్పటికే కోర్టు సీరియస్ అయ్యింది. ప్రస్తుతం హైకోర్టులో వేసిన పిటిషన్ పైనే జగన్ అన్ని ఆశలు పెట్టుకున్నారు. అక్కడ గనుక హాజరు మినహాయింపు పర్మిషన్ రాకపోతే జగన్ ప్రతి వారం కోర్టుకు రాకతప్పని పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.
ఇది ఇలా ఉండగా… రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి వచ్చిన ముఖ్యమంత్రి… ఈరోజు మళ్ళీ ఢిల్లీ వెళ్లారు. హోమ్ మంత్రి అమిత్ షాని కలవబోతున్నట్టు సమాచారం. చాలా కాలం నిరీక్షణ తరువాత జగన్ కు అమిత్ షా అప్పాయింట్మెంట్ దొరికింది. ఆంధ్రప్రదేశ్ లోని కీలక రాజకీయ పరిణామాల మధ్య జగన్ వరుస ఢిల్లీ పర్యటనలు ఆసక్తి రేపుతున్నాయి.