సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అసాధ్యం : అసెంబ్లీ కార్యదర్శి
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ప్రతిపాదించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని అసెంబ్లీ కార్యదర్శి మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ పంపిన ఫైలును ఆయన వెనక్కి పంపించారు. క్లాజ్ 189 ఏ.. ప్రకారం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని లెజిస్లేచర్ కార్యదర్శి (ఇన్‌చార్జి) పి.బాలకృష్ణమాచార్య పేర్కొన్నారు.
(చదవండి : ఏపీ: సెలెక్ట్ కమిటీకి నో)
మండలి చైర్మన్ నిర్ణయంతోనే..
పాలనా వికేంద్రీకరణ బిల్లును జనవరి 21న అసెంబ్లీ ఆమోదించి అదే రోజు శాసనమండలికి పంపింది. 22న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలు ఈ బిల్లును మండలిలో ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ప్రతిపక్షం ఆ బిల్లును మండలి పరిశీలనకు తీసుకోవడానికి ముందే నోటీసులు ఇవ్వాలి. అయితే అలా జరగకపోగా, రెండు రోజుల సుదీర్ఘ వివాదానంతరం 23వ తేదీ చైర్మన్.. తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు చెప్పి సమావేశాలను వాయిదా వేయడంతో వివాదం తలెత్తడం తెలిసిందే.