https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/02/14/japan.jpg?itok=dQI7jCOs

సీక్రెట్‌ చెప్పేసిన ప్రపంచ కురు వృద్దుడు

టోక్యో: నిండు నూరేళ్లు చల్లగా బతుకు అని ఆశీర్వదిస్తుంటారు.. కానీ ప్రస్తుత జనరేషన్‌లో అది ఎంతవరకు సాధ్యమనేది ఎప్పటికీ ఓ భేతాళ ప్రశ్నగా మిగిలింది. చావు ఎప్పుడు ఏ వైపు నుంచి తరుముకు వస్తుందో తెలీని రోజులివి. పైగా మారుతున్న జీవనశైలితో అరవై ఏళ్లకే కన్నుమూస్తున్న దుస్థితి. కానీ జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం 112 సంవత్సరాల 334 రోజుల వయస్సుతో.. ప్రపంచంలోనే అత్యంత కురు వృద్దుడుగా బుధవారం గిన్నిస్‌ రికార్డు అందుకున్నాడు. గతంలోనూ జపనీస్‌కు చెందిన వ్యక్తిపై ఈ రికార్డు ఉండగా అతను గత నెలలో చనిపోయారు. దీంతో జీవించి ఉన్నవారిలో ప్రపంచంలోనే ఎక్కువ వయసుస్సున్న వ్యక్తిగా చిటెస్తు వటనబె రికార్డు నెలకొల్పాడు.

అదే నా జీవిత రహస్యం..
1907లో దక్షిణ జపాన్‌లోని నీగటలో చిటెస్తు వటనబె జన్మించాడు. స్థానిక వ్యవసాయ విద్యాలయంలో చదువు పూర్తి చేశాడు. అనంతరం తైవాన్‌కు వెళ్లి చెరకు ప్లాంటేషన్‌ కాంట్రాక్టు పనిలో కుదిరాడు. అక్కడే 18 సంవత్సరాలు నివాసం కొనసాగించాడు. అనంతరం మిట్సు అనే మహిళను వివాహమాడగా వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తిరిగి తన స్వస్థలమైన నీగటకు చేరుకున్న అతను ప్రస్తుతం అక్కడే కాలం వెళ్లదీస్తున్నాడు. ఇక ఇంత వయస్సు మీదపడ్డ ఇప్పటికీ తన పొలంలో పండ్లు, కూరగాయలు పండిస్తూ నేటితరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే ఆయన తాజాగా ఎక్కువ ఆయుష్షుతో జీవించడానికి గల రహస్యాన్ని బహిరంగంగా చెప్పుకొచ్చాడు. ‘ఎప్పుడూ కోపానికి రాకండి. ముఖాలపై చిరునవ్వును చెరగనీయకండి’ అని విలువైన సలహా ఇచ్చాడు.