ఈ యాప్స్ గురించి ఎందరికి తెలుసు ?!
సాక్షి, న్యూఢిల్లీ : భూకంపాలు, సునామీలు రావడం, అగ్ని పర్వతాలు రాజుకోవడం, అడవులు తగలబడడం, అధిక వర్షాలతో వరదలు ముంచెత్తడం లాంటి ప్రకృతి ప్రళయాలు సంభవించినప్పుడే కాకుండా కరోనా వైరస్, సార్స్, మెర్స్‌లాంటి వైరస్‌లు విజృంభించినప్పుడు మానవ జాతి ఎంతో నష్టపోతోంది. అలాంటప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు భారత్ సంక్షోభ నివారణ వ్యవస్థ ఒకటి ఏర్పాటై ఉంది. అయితే నష్టాన్ని అరికట్టడం ఆ ఒక్క సంస్థ వల్ల సాధ్యమయ్యే పనికాదు.
ప్రజలంతా ఒకరికొకరు సాయం చేసుకోవడమే కాకుండా ఎక్కడ, ఎవరికి, ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో? అందుకు ఎలాంటి సాయం అవసరం అవుతుందో ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయాల్సిన బాధ్యత ప్రజలకుంది. నేటి ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో ఆ బాధ్యత మరింత పెరిగింది. అలా సమాచారాన్ని చేరవేయడానికి భారత్‌లో 33 యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ఉచితంగా లభించే యాప్స్. ఆండ్రాయిడ్ బేస్డ్‌గా ఉన్న ఈ యాప్స్ అన్నీ ‘గూగుల్ ప్లే స్టోర్’లో అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఈ యాప్‌ల గురించి ఎవరికి పెద్దగా తెలియదని, తెల్సినా వినియోగం తక్కువేనని జపాన్‌లోని కియో యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. వీటిలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు ప్రవేశపెట్టినవి ఉన్నాయి. 2005లో ‘డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్’ తీసుకొచ్చాక ఈ యాప్‌లన్నీ పుట్టుకొచ్చాయి.
ఈ 33 యాప్స్‌లో ఐయోవా లీగల్ ఎయిడ్, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్, బిల్డింగ్ ఇవాక్ అనే యాప్స్ మాత్రం భారత్‌ను దష్టిలో పెట్టుకొని రూపొందించినవి ఎంతమాత్రం కాదు. అవి అందించే విషయ పరిజ్ఞానం భారతీయులకు కూడా ఎంతో అవసరం కనుక ఆ మూడింటిని కూడా 30 యాప్స్‌తో కలిపి కియో యూనివర్శిటీ బృందం, ఎందుకు వీటికి ఎక్కువ ఆదరణ లేకుండా పోతుందనే విషయంపై ఈ అధ్యయనం జరిపింది. వీటిలో 18 యాప్స్ ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించేవి మాత్రమేనట. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌తో వచ్చిన ‘డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాప్’ను ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్నారట. ఇది పలు రకాల ప్రకతి వైపరీత్యాల గురించి సమాచారం అందించడమే కాకుండా కొన్ని ముందు జాగ్రత్తలు సూచిస్తోందట. ఐదు యాప్స్ మాత్రం రాష్ట్రానికి, సిటీకి మాత్రమే పరిమితమై ఉన్నాయట. ‘సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ’ యాప్ కేవలం సిక్కిం రాష్ట్రానికే పరిమితమైనది.
వీటిలో ఏడింటికి మాత్రమే జీపీఎస్ సెన్సర్లు కలిగి ఉన్నాయి. వాటిలో నాలుగు యాప్స్ ప్రాథమిక ఫంక్షన్నే కలిగి ఉన్నాయి. ఇలా ప్రతి దానిలో ఏదో ఒక లోపం ఉండడమే వల్లనే వీటికి ఎక్కువగా ఆదరణ లేకపోయిందని యూనివర్శిటీ బందం కేంద్రానికి ఓ నివేదికను సమర్పించింది. ఆ మధ్య ముంబై నగరంతోపాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వరదలు వచ్చినప్పుడు వీటిలో కొన్ని యాప్స్ బాగానే ఉపయోగపడ్డాయట.