https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/02/14/dead-body.jpg?itok=l0pYu4_T

వివాహేతర సంబంధం; టీవీ నటి దారుణ హత్య..!

డెహ్రాడూన్‌ : పంజాబ్‌కు చెందిన ఓ టీవీ నటి భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. వివరాలు.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు చెందిన అనితా సింగ్‌ (29), రవీందర్‌సింగ్‌ పాల్‌ భార్యాభర్తలు.. అనితా టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. ఈక్రమంలో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. వివాహేతర సంబంధం కారణంగా భార్య తనను దూరం పెడుతోందని భావించిన రవీందర్‌ ఆమెను హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ఢిల్లీకి చెందిన తన మిత్రుడు కుల్దీప్‌తో పక్కా స్కెచ్‌ వేశాడు. కుల్దీప్‌కు చిత్రసీమలో పరిచయాలున్నాయని, అతన్ని కలిస్తే బాలీవుడ్‌లో అవకాశాలు ఇప్పిస్తాడని నమ్మబలికాడు.

దాంట్లో భాగంగానే ఉత్తరాఖండ్‌లోని కలదుంగీకి రవీందర్‌ అనితను తీసుకెళ్లాడు. అక్కడ కుల్దీప్‌ని కలిసిన అనంతరం.. ముగ్గురూ ఓ హోటల్‌లో భోజనం చేశారు. అనితకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చిన నిందితులు.. ఆమె స్పృహ కోల్పోగానే కారులో ఓ అడవిలోకి తీసుకెళ్లి గొంత నులిమి చంపేశారు. ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. అయితే, అనిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటీజీ ఆధారంగా కేసును ఛేదించారు. నిందితులు రవీందర్‌, కుల్దీప్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించామని నైనిటాల్‌ ఎస్పీ ఎస్‌కే.మీనా శుక్రవారం తెలిపారు.