రూ. 8లక్షల విరాళం ఇచ్చిన బిచ్చగాడు
విజయవాడ: చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఏ గుడి ముందు అయిన కూడా బిచ్చగాళ్లు ఉంటారు. ఎక్కువగా బయటే ఉండే బిచ్చగాళ్లు లోపలకు వెళ్లే సందర్బాలు అరుదు. ఇక ఆ బిచ్చగాళ్లు హుండీలో డబ్బులు వేయడం మరీ అరుదు. కానీ నల్లగొండ జిల్లాకు చెందిన యాదిరెడ్డి అనే 75 సంవత్సరాల వ్యక్తి ఏ గుడి ముందు అయితే బిచ్చం ఎత్తుకున్నాడో ఆ గుడికి భారీ విరాళం ఇచ్చి అందరిని ఆశ్చర్యపర్చారు. విజయవాడలోని ముత్యాలంపాడులో ఉన్న సాయిబాబా ఆలయానికి కొన్నేళ్లలో 8 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. నిజానికి అతను ఒకప్పుడు రిక్షా లాగుతూ బతికేవాడు.
మోకాలి చిప్పలు అరిగిపోయి, రిక్షా తొక్కలేని పరిస్థితి రావడంతో గుడుల ముందు భిక్షమెత్తుకోవడం మొదలుపెట్టాడు. విజయవాడలో ఆలయాల ముందు కూర్చుని బిచ్చమెత్తుకుంటాడు. అలా రోజూ వచ్చే డబ్బులన్నీ పోగేస్తూ.. మళ్లీ గుడులకే విరాళంగా ఇస్తున్నారు. మొదట్లో తాను లక్ష రూపాయలను గుడికి విరాళంగా ఇచ్చానని యాదిరెడ్డి చెప్పారు. కాలం గడుస్తున్న కొద్దీ తన ఆరోగ్యం దెబ్బతింటోందని, తనకు వచ్చిన డబ్బంతా గుడికే ఇచ్చేస్తున్నానని తెలిపారు. తాను గుడికి డబ్బులివ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి అక్కడికి వచ్చే భక్తుల్లో తనకు గుర్తింపు వచ్చిందని.. తనకు వచ్చే డబ్బులు మరింతగా పెరిగాయని యాదిరెడ్డి వెల్లడించారు. ఒక్క సాయిబాబా గుడికే కాకుండా మరికొన్ని ఆలయాలకు కూడా తాను డబ్బులు విరాళంగా ఇచ్చానని చెప్పారు. తన జీవితమంతా దేవుడి సన్నిధిలోనే గడిపేస్తానంటూ యాదిరెడ్డి చెప్పుకొచ్చారు.