https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/02/14/gujarat.jpg?itok=389QHEJ3

విద్యార్థినులు లోదుస్తులు తొలగించాలంటూ..

గాంధీనగర్‌: గుజరాత్‌లోని ఓ కళాశాల యాజమాన్యం విద్యార్థినుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించింది. విద్యార్థినుల్లో ఎవరెవరు నెలసరితో ఉన్నారో తెలుసుకునేందుకు లో దుస్తులు తొలగించాల్సిందిగా ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆదేశించారు. పిరియడ్స్‌ సమయంలో కొన్నింటిని విద్యార్థినులు తాకకుండా దూరంగా ఉంచేందుకు హాస్టల్‌ వార్డెన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాలేజీ ప్రిన్సిపాల్‌ ఈ చర్యకు పూనుకున్నారు. గుజరాత్‌లోని బుజ్‌ ప్రాంతంలో శ్రీ సహజానంద్‌ గర్ల్స్‌ ఇనిస్టిట్యూట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. (క్లాస్‌మేట్‌ను ఫేస్‌బుక్‌ ద్వారా..)

నెలసరి సమయంలో విద్యార్థినులు కాలేజీ ప్రాంగణంలోని ఆలయ‍ంలోకి వెళ్తున్నారని, కిచెన్‌ లోపలికి కూడా వెళ్తూ..ఎక్కడపడితే అక్కడ,, ఎవరిని పడితే వారిని తాకుతున్నారంటూ గురువారం  కాలేజీ ప్రిన్సిపాల్‌ తరగతి గదిలో ఉన్న 68 మంది విద్యార్థులను బయటకు పిలిపించింది. అక్కడ నుంచి వారందరినీ వాష్‌ రూమ్‌కి తీసుకెళ్లి వరుసలో నిలబెట్టి ఒక్కొక్కరినీ లో దుస్తులు తొలగించి నెలసరిలో ఉన్నారో లేదో చూపించాలని ప్రిన్సిపాల్‌ ఆదేశించింది. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థులు నెలసరిలో ఉన్నామంటూ పక్కకు తప్పుకోగా ప్రిన్సిపాల్‌ వారిని దుర్భాషలాడింది.  (యువతిపై సాముహిక అత్యాచారం.. అరెస్ట్‌)

కాగా స్వామి నారాయణ్ ద్విశతాబ్ది మెడికల్‌ అండ్‌ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న శ్రీ సహజనంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్‌‌లో దాదాపు 1500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. భారతీయ సాంప్రదాయాలు అనే పునాదులపై ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆచారాలు, నియమాలు, సాంప్రదాయ విలువలకు ఇక్కడ పెద్ద పీట వేస్తారు. నియమాల ప్రకారం.. నెలసరి సమయంలో విద్యార్థినులు ఆలయంలోకి, కిచెన్‌లోకి వెళ్లరాదు. అదే సమయంలో ఇతర విద్యార్థులను తాకరాదు. అయితే కిచెన్‌లో వాడేసిన శానిటరీ న్యాప్‌కీన్స్‌ ఉన్నాయంటూ.. హాస్టల్ వార్డెన్ విద్యార్థినులపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. 

మరోవైపు విద్యార్థినులు మాత్రం కాలేజీ యాజమాన్యం తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన తమకు కళాశాలలో కనీస సౌకర్యాలు లేవని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటోంది. అదే సమయంలో ఈ ఘటనపై ట్రస్ట్‌ సభ్యులు హిరానీ .. విద్యార్థులకు జరిగిన అవమానాన్ని తప్పుబట్టారు.