https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/02/14/omar%20abdula.jpg?itok=0ZD-SNv0

ఒమర్‌ నిర్బంధంపై సుప్రీం నోటీసులు

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా నిర్బంధాన్ని సవాల్‌ చేస్తూ ఆయన సోదరి సారా అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం జమ్ము కశ్మీర్‌ అధికార యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది.  ప్రజా భద్రత చట్టం కింద ఒమర్‌ నిర్బంధం సరైనదేనా అనే అంశంలో విచారణను చేపట్టిన సర్వోన్నత న్యాయస్ధానం తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది. ఒమర్‌ను తక్షణమే కోర్టులో హాజరుపరిచి ఆయనను విడుదల చేయాలని సోదరి సారా అబ్దుల్లా తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్ధించారు. కాగా ఒమర్‌ త్వరలో విడుదలవుతారని సారా పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థ పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని, మిగిలిన దేశ ప్రజలందరి మాదిరిగానే కశ్మీరీలకూ అవే హక్కులున్నాయని తాము నమ్ముతున్నామని అన్నారు. ఆ రోజు కోసం తాము వేచిచూస్తున్నామని చెప్పారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన క్రమంలో గత ఏడాది ఆగస్ట్‌ 5 నుంచి జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఫరూక్‌ అబ్దుల్లా సహా ఒమర్‌ అబ్దుల్లాను గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు, రాళ్ల దాడులకు పాల్పడే వారిపై ప్రయోగించే ప్రజా భద్రత చట్టం కిందే వీరందరినీ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకోవడం గమనార్హం. కాగా ఈ పిటిషన్‌ స్వేచ్ఛకు సంబంధించిందని తక్షణమే విచారణకు చేపట్టాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ చేసిన వినతిని తోసిపుచ్చిన కోర్టు మార్చి 2నే తదుపరి విచారణ చేపడతామని స్పషం చేసింది.

చదవండి : ఆ రోజు అస్సలు మర్చిపోను.. చపాతీలో..