నిర్భయ కేసు: వినయ్ శర్మ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్షమాభిక్ష తిరస్కరణను చాలెంజ్ చేస్తూ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. జైల్లో తీవ్రమైన టార్చర్ కారణంగా వినయ్ శర్మ మానసిక స్థితి సరిగా లేదని, క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే సమయంలో ఆ విషయాన్ని రాష్ట్రపతి పరిగణించలేదని అతని తరపు లాయర్ వాదించారు. అతను మానసిక అనారోగ్యంతో ఉన్నాడని చెప్పే మెడికల్ రికార్డులు రాష్ట్రపతి వద్దకు రాలేదని కోర్టుకు తెలిపారు.
కాగా, ఈ వాదనల్ని కేంద్రం తోసిపుచ్చింది. వినయ్ శర్మ మానసిక స్థితి బాగానే ఉందని కోర్టు దృష్టికి తెచ్చింది. ఫిబ్రవరి 12 నాటి మెడికల్ రికార్డుల ప్రకారం వినయ్ ఆరోగ్య స్థితికి ఇబ్బందేం లేదని కేంద్రం తరపు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. కేంద్రం వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు వినయ్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇక 2012లో నిర్భయ ఘటన జరగగా.. 2020లో (జనవరి 22, ఫిబ్రవరి 1) దోషుల ఉరిశిక్ష అమలుకై రెండుసార్లు డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ.. వారు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తు శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
(చదవండి : నిర్భయ దోషికి లాయర్‌ను నియమించిన కోర్టు)