https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/02/14/Madhu.jpg?itok=hcHYpGU2
సీపీఎం నేత పెనుమల్లి మధు

‘బాబు, లోకేశ్‌లకు తెలిసే జరిగింది..’

సాక్షి, విజయవాడ: ఆదాయపన్ను శాఖ దాడుల్లో వెలుగు చూసిన రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌కు తెలిసే అవినీతి జరిగిందని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా జరుగుతన్న ఐటీ దాడులను బట్టి ఈ విషయం స్పష్టమైందన్నారు. చంద్రబాబు హయాంలో పెద్ద కుంభకోణం జరిగిందని, నేరస్తుల మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత మాజీ కార్యదర్శి నివాసంలో సోదాలు చేస్తేనే రెండు వేల కోట్ల బయటపడితే.. చంద్రబాబు, లోకేశ్‌లపై దాడులు చేస్తే ఎన్ని వేల కోట్లు బైటపడతాయోనని ఆశ్చర్యపోయారు. చంద్రబాబు నాయుడు మీదనే కాదు టీడీపీ నాయకులు మీద కూడా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. (చంద్రబాబును తక్షణం అరెస్టు చేయాలి: వైఎస్సార్‌సీపీ)

2 లక్షల కోట్లకు పైమాటే: ఎమ్మెల్సీ సునీత
టీడీపీ బినామి సంస్థలు లక్షల కోట్లు కాజేశాయని ఎమ్మెల్సీ పోతుల సునీత ఆరోపించారు. ఒంగోలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రెండు వేల కోట్లు కాదు రెండు లక్షల కోట్లకు పైగానే చంద్రబాబు దోచుకున్నారని అన్నారు. రాజధాని అమరావతి పేరుతో రైతుల నుంచి వేల ఎకరాలు కాజేసి, భూములను అడ్డగోలుగా అమ్ముకున్నారని మండిపడ్డారు. (చదవండి: చంద్రబాబు అవినీతి బట్టబయలు)