https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2020//Jan//20200131//Hyderabad//637160840103678251.jpg

ఏప్రిల్‌ 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ: జగన్ ఆదేశం

అమరావతి: ఏప్రిల్‌ 1 నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. పౌరసరఫరాలశాఖపై సీఎం జగన్మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని, సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

 

ప్యాక్‌ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీని అన్ని జిల్లాల్లో అమలు చేయడంపై జగన్ సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన బియ్యం, నిల్వలపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. నాణ్యమైన బియ్యం సరఫరాకు 26.63 లక్షల టన్నులు అవసరం కాగా, ఖరీఫ్‌లో, రబీలో పంట ద్వారా 28.74 లక్షల టన్నులు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.

 

వివిధ జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను అధికారులు సీఎంకు చూపించారు. శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. ఏప్రిల్‌ నుంచి జిల్లాకో నియోజకవర్గం చొప్పున ప్యాక్‌ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

 

ఏప్రిల్‌ 1 నాటికి 22 నియోజకవర్గాలు, మే నాటికి 46 నియోజకవర్గాలు, జూన్‌ నాటికి 70 నియోజకవర్గాలు, జులై నాటికి 106, ఆగస్టు నాటికి 175 నియోజకవర్గాల్లో ప్యాక్‌ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలన్నారు. పర్యావరణానికి హాని జరగకుండా బియ్యాన్ని ప్యాక్‌ చేయడానికి వాడుతున్న సంచులను తిరిగి సేకరించేలా చూడాలని సీఎం ఆదేశించారు.