ప్రభుత్వానికి గంటా సున్నితమైన హెచ్చరిక

by
https://www.mirchi9.com/wp-content/uploads/2020/01/ganta-srinivasa-rao-questions-ys-jagan-government-2.jpg

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంట శ్రీనివాసరావు మొన్నటివరకూ వైఎస్సార్ కాంగ్రెస్ లోకో, బీజేపీలోకో వెళ్తారు అనే ప్రచారం గట్టిగా ఉండేది. ఆయన పార్టీ కార్యక్రమాలలో అంటీముట్టకుండా ఉండడంతో అది మరింత బలపడింది. అయితే గంట నెమ్మదిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం మొదలు పెట్టారు. తాజాగా ఆయన ప్రభుత్వం మీద కూడా విమర్శలు చెయ్యడం గమనార్హం.

వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనాదృక్పథం అవలంభిస్తే మంచిదన్నారు ఆయన. వైజాగ్ కి ప్రాచీన నామం అయిన వాల్తేరు పేరుతో 1883 లో ప్రారంభం అయినప్పటినుంచి ఈ క్లబ్ వైజాగ్ ప్రజల జీవన విధానంలో మమేకమైందని తెలిపారు.

వైజాగ్ బ్రాండ్ లో భాగమైంది. అందరికీ ఆహ్లాదాన్ని, ఆతిధ్యాన్ని ఇచ్చే మచ్చికైన ప్రాంతం కావడంతో అనుబంధం పెరిగింది. ఇందులో ఎందరో విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, దేశభక్తులు, వివిధ రంగాలలో ప్రావీణ్యం పొందిన నిపుణులు, దేశ విదేశాలలో తమ తమ రంగాలలో అగ్రస్థానంలో ఉన్న తెలుగు వారు చాలా మంది సభ్యులుగా ఉన్నారు.

ఈ సున్నితత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం దీనిని యధాతధంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే… వైజాగ్ లో మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్నారు గంటా. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి, కృషి చేస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈనాడులో ఈరోజు కొందరు వాల్తేరు క్లబ్ పై కన్నేశారు అంటూ అధికార పార్టీ నేతల పై వచ్చిన కథనం నేపథ్యంలో గంటా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సున్నితంగానే ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించడం విశేషం.