ఎన్ని ఆంక్షలు పెట్టినా యాపిల్‌ని కొట్టేసిన ఫోన్.. ఏంటో తెలుసా?
ఇండియాలో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌లో ఎక్కువ పాపులర్ ఏదీ అంటే షియామీ అంటాం. ఆ తరవాత శామ్‌సంగ్. యాపిల్ బ్రాండ్ ఎంత క్రేజ్ ఉన్నా - మొదటి స్థానానికి చేరలేకపోవడానికి కారణం - సామాన్యుడికి అందుబాటులో ఉండని యాపిల్ ఫోన్ల ధరలే అని వేరే చెప్పాల్సిన పని లేదు. ఎప్పడూ తక్కువ ధరలో మంచి క్వాలిటీ కోసం ఎదురుచూసే ఇండియన్స్ - శామ్‌సంగ్ కంటే షియామీ ఫోన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారిప్పుడు.
ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా యాపిల్ మొదటి స్థానంలో ఏమీ లేదు. శామ్‌సంగ్ నంబర్‌వన్ పొజిషన్లో ఉంటే - అమ్మకాల్లో యాపిల్ ఇప్పటివరకూ రెండో స్థానంలోనే ఉంటూ వస్తోంది. అయితే ఇప్పుడు ఆ స్థానం మూడుకి పడిపోయిందట!
ఇండియాలో యాపిల్‌కీ శామ్‌సంగ్‌కి చైనా బ్రాండ్ షియామీ పోటీ ఇస్తే - గ్లోబల్ మార్కెట్లో కూడా మరో చైనా బ్రాండ్ యాపిల్‌ని మూడో స్థానంలోకి నెట్టేసింది. ఆ బ్రాండ్ ఏంటో తెలుసా? హ్యువావీ(Huawei).
అవును. మార్కెట్ మానిటర్ సర్వీస్ లెక్కల ప్రకారం - 2019 లో ప్రపంచవ్యాప్తంగా హ్యువావీ ఫోన్లు తమ అమ్మకాల్ని విపరీతంగా పెంచుకున్నాయట. అందువల్ల ఇప్పుడు - ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శామ్‌సంగ్ అయితే - రెండో బ్రాండ్ హ్యువావీ అని చెప్పాల్సి వస్తోంది.
హ్యువావీ దెబ్బకి యాపిల్ మూడో స్థానానికి వెళ్లిపోవాల్సి రావడం నిజంగా గుర్తించదగిన పరిణామం. ఇంకా గుర్తించదగినదేమంటే - హ్యువావీ కంపెనీ మీద ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ఎన్నో ఆంక్షలు విధించింది. అయినప్పటికీ వాటన్నిటినీ తట్టుకుని హ్యువావీ - రెండో స్థానానికి ఎగబాకడం నిజంగా గొప్ప విజయం అని చెప్పి తీరాలి.