https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/01/31/Danish-Kaneria.jpg?itok=ydf-WgHg

కనేరియా.. మతం మార్చుకో

న్యూఢిల్లీ: మతం మార్చుకోవాలని సలహా ఇచ్చిన నెటిజన్‌కు పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ దానిష్‌ కనేరియా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. తాను మతం మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. ‘ఇస్లాం మతాన్ని స్వీకరించండి. ఇస్లాం బంగారం లాంటిది. ఇస్లాం లేకపోతే జీవితం లేదని నాకు తెలుసు. దయచేసి ఈ బంగారాన్ని అంగీకరించండి’ అంటూ ఓ నెటిజన్‌ ట్విటర్‌లో కనేరియాను కోరాడు. ‘మీలాంటి చాలా మంది నన్ను వేరే మతంలోకి మార్చాలని ప్రయత్నించారు. కానీ వారెవరూ విజయవంతం కాలేద’ని కనేరియా సమాధానం ఇచ్చాడు.

కాగా, హిందువైన కారణంగా పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులో వివక్ష ఎదుర్కొన్నానని అంగీకరించి గతేడాది కనేరియా వివాదాలపాలయ్యాడు. తన సహచర క్రికెటరైన కనేరియాను హిందూ అనే కారణంగా తీవ్రంగా అవమానించిన సందర్భాలు చాలానే ఉన్నాయని మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ వెల్లడించడంతో వివాదం రేగింది. ‘షోయబ్‌ అక్తర్‌ ఒక లెజెండ్‌. నాకు ఎప్పుడూ అక్తర్‌ మద్దతుగానే ఉండేవాడు. కానీ ఆ సమయంలో నాపై వివక్ష చూపెట్టేవారిని ఎదురించే సాహసం చేయలేకపోయాను. అక్తర్‌తో పాటు ఇంజమాముల్‌ హక్‌, మహ్మద్‌ యూసఫ్‌, యూనస్‌ ఖాన్‌లు నాకు అండగా ఉండేవార’ని కనేరియా పేర్కొన్నాడు.