‘బాబు విశాఖ ప్రజలపై విషం చిమ్ముతున్నారు’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. జిల్లాలో మంత్రి అవంతి శ్రీనివాస్ నిర్వహించిన జీవీఎంసీ సమీక్షలో ఆయనతోపాటు ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కురసాల కన్నబాబు, భాగ్యలక్ష్మీ, గొల్ల బాబూరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. విశాఖ ప్రజలు చంద్రబాబుకి నాలుగు సీట్లు ఇస్తే ఆయన ప్రజలపై అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. ఒకే ప్రాంతంలో అభివృద్ది వల్ల ఇతర ప్రాంతాలకి నష్టమని చంద్రబాబు తీరువల్ల ప్రజలు నష్టపోయే పరిస్ధితి వచ్చిందని విమర్శిచారు. చంద్రబాబు తన స్ధాయి మరిచి విశాఖ, రాయలసీమపై కుట్రలు చేస్తున్నారని, పెద్దల సభలో టీడీపీ నుంచి ఎక్కవ మంది అవగాహన లేని వారే ఉన్నారు ఎద్దేవా చేశారు. కౌన్సుల్ రద్దు కాకుండా చంద్రబాబు బీజేపీ నేతలతో టచ్‌లో ఉండటం దారుణమన్నారు. చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలని, ఓట్లేసిన విశాఖ ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పోడుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాటలకు మద్దతిస్తున్న విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఎమ్మెల్యేలు రోడ్లపైకి వస్తే ప్రజలు తన్నేలా ఉన్నారని, విశాఖపై కుట్రలు చేస్తున్న చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఆయన విమర్శించారు.
ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ: చంద్రబాబు విశాఖపై విషం చిమ్ముతున్నారన్నారు. ఉత్తరాంధ్రపై కుట్రలు పన్నుతున్న చంద్రబాబును ఈ ప్రాంతంలో అడుగుపెట్టనీయమన్నారు. విశాఖ సుందరమైన నగరం...దేశంలోనే విశాఖకు 9 వ స్ధానం ఉందని పేర్కొన్నారు. విశాఖ ప్రజలు చేసిన అన్యాయమేంటని, మిమ్మల్ని గెలిపించడమే విశాఖ ప్రజలు చేసిన శాపమా అని ప్రశ్నించారు. కాగా బీజేపీని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, అమిత్ షాను ఘోరాతి ఘోరంగా తిట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని .. రాజధాని భూములని రైతులకి తిరిగి ఇచ్చేస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలోనే ఉందని తెలిపారు. వికేంద్రీకరణను బీజేపీ వ్యతిరేకిస్తే వారి మేనిఫెస్టోను వారే వ్యతిరేకించినట్లే అన్నారు. ఇక మార్చి నాటికి విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుందనుకుంటున్నానని ఆయన అభిప్రాయపడ్డారు.
వివిధ శాఖల అధికారులతో మంత్రి అవంతి సమీక్ష
ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ: గతంలో విశాఖపై ప్రశంసలు కురిపించలేదా చంద్రబాబు అని ప్రశ్నించారు. ఇపుడు చంద్రబాబుకి విశాఖ ఎందుకు చేదుగా మారిందని, దురుద్దేశపూర్వకంగానే చంద్రబాబు విశాఖ పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖ ప్రజలు చంద్రబాబుకి నాలుగు సీట్లు ఇస్తే మీరు ప్రజలకేం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతిపక్షనాయకుడు కాదు...ఒక వర్గానికి మాత్రమే నేత అన్నారు. విశాఖలో నాలుగు సీట్లు ఇచ్చిన ప్రజలే చంద్రబాబు తీరును ఛీ కొడుతున్నారని, రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో చంద్రబాబుకి ప్రజలే తగిన బుద్ది చెబుతారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ: చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్దిని కుతంత్రాలతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి రాజకీయ సమాధి కట్టేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఆయన ఒక ప్రాంతానికే పరిమితమయ్యారన్నారు. చంద్రబాబును ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వమని, విశాఖ పరిపాలనా రాజధానిగా వచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. వెన్నుపోటు రాజకీయాలు, కుళ్లు, కుతంత్రాలు, కుట్రలు చంద్రబాబు నైజమని విమర్శించారు. ఆదరించిన ఉత్తరాంధ్రకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని, దమ్ముంటే 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజలలోకి వెళ్లామని ఆయన సవాలు విసిరారు.
ఇక ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ: చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వికేంద్రీకరణ అమలు జరిగితే రాష్ట్రం సువర్ణయుగంగా మారుతుందన్నారు. వికేంద్రీకరణబిల్లు అమలు ద్వారా ఏపీ దేశంలోనే అగ్రాగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆరు నెలల సంక్షేమ పాల చూసి టీడీపీ నేతలు సైతం సీఎం జగన్‌కు జై కొడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తీరుమారకుంటే 23 నుంచి 3కి తగ్గిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు.