బీజేపీ వరాల జల్లు.. ఉచిత స్కూటీలు
- ఢిల్లీ ఎన్నికల మేనిఫేస్టోని ప్రకటించిన బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ఓటర్లపై బీజేపీ వరాల జల్లు కురిపించింది. హస్తిన అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ ఎన్నికల మేనిఫేస్టోని శుక్రవారం విడుదల చేసింది. వీటిలోని ముఖ్య అంశాలను ఆ పార్టీ చీఫ్ మనోజ్ తివారీ మీడియా ముందు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు, పాఠశాల పిల్లలకు సైకిల్స్ పంపిణి చేస్తామన్నారు. ఢిల్లీ నివసించే పేదలు గోదుమలు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వారికి కేవలం రెండు రూపాయాలకే కేజీ గోదుమ పిండి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ప్రకాశ్ జవడేకర్, మనోజ్ తివారీ బీజేపీ నేతలు పాల్గొన్నారు.
బీజేపీ ప్రకటించిన మేనిఫేస్టోలని ముఖ్య అంశాలు..
- బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీ వ్యాప్తంగా కొత్తగా 200 కాలేజీలు ఏర్పాటు చేస్తాం.
- రాబోయే ఐదేళ్లలో కనీసం 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
- ఎస్సీ, ఎస్టీ బీసీ, అగ్రవర్ణ పేదల కోసం వేర్వరుగా డెవెలప్మెంట్ బోర్డులు
- పిల్లల పెళ్లిళ్ల కోసం, ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం
- ఢిల్లీ-యమునా వికాస్ బోర్డు, 20 సూత్రాల పథకంలో నిర్మించిన ఇళ్లకు రిజిస్ట్రేషన్
- స్టార్ట్ అప్లకు పోత్సాహంతో పాటు ఫిట్ ఇండియా-ఫిట్ ఢిల్లీ పథకం అమలు
- ఢిల్లీలో అక్రమ నివాసాలుగా ఉన్న 1728 కాలనీలోని ప్రజలకు ఉచిత ఇళ్ల పట్టాలు ఇస్తాం
- మంచినీటి సమస్యను పరిష్కరిస్తాం
- విద్యా, వైద్య, ఆరోగ్యంలో ఢిల్లీని మొదటి స్థానంలో నిలుపుతాం