ఐబీఎం సీఈవోగా భారత సంతతి వ్యక్తి
న్యూయార్క్: అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈఓల జాబితాలో మరో భారతీయుడు చేరాడు. టెక్ దిగ్గజం ఐబీఎం సీఈవోగా భారత సంతతికి చెందిన అరవింద్ కృష్ణ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఐబీఎం క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాఫ్ట్‌వేర్ విభాగం చీఫ్‌గా ఉన్న అరవింద్.. త్వరలోనే సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఐబీఎం సీఈవోగా ఉన్న వర్జీనియా రొమెట్టీ త్వరలోనే పదవీ విరమణ చేస్తారు. 62ఏళ్ల రొమెట్టీ దాదాపు 40ఏళ్లు ఐబీఎం కంపెనీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త సీఈవో కోసం కంపెనీ యాజమాన్యం అరవింద్ కృష్ణను ఎంపిక చేసింది.
సీఈవోగా ఎంపికవడంపై అరవింద్ ఆనందం వ్యక్తంచేశారు. 57ఏళ్ల అరవింద్ కాన్పూర్ ఐఐటీలో డిగ్రీ పూర్తిచేశారు. ఆపై యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. 1990లో ఐబీఎంలో చేరి రకరకాల బాధ్యతలు నిర్వర్తించి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. సీఈవోగా ఎంపికైన సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. ‘ఐబీఎం కంపెనీ తదుపరి సీఈవోగా ఎంపికైనందుకు చాలా ఆనందంగా, థ్రిల్లింగ్‌గా ఉంది. నాపై రొమెట్టీ, బోర్డు సభ్యులు ఉంచిన
నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటాను’ అని తెలిపారు.