విప్రో సీఈవో రాజీనామా
ముంబై: ఐటీ దిగ్గజం ‘విప్రో’ సీఈవో అబిదాలీ నీముచ్‌వాలా తన పదవికి రాజీనామా చేశారు. కుటుంబ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు.. శుక్రవారం తెల్లవారుజామున విడుదల చేసిన రాజీనామా ప్రకటనలో తెలిపారు. దాదాపు 75 ఏళ్ల చరిత్ర ఉన్న విప్రోలో పని చేయడం.. తనకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన అజీమ్ ప్రేమ్‌జీ, రిషబ్, ఇతర బోర్డు సభ్యులు, తోటి ఉద్యోగులు, వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రాజీనామాను విప్రో యాజమాన్యం ఆమోదించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అబిద్ నాయకత్వం, విప్రోకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. గత నాలుగేళ్లుగా సంస్థను బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దడంలో.. డిజిటల్ వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు.
2015 ఏప్రిల్‌లో సీఓఓగా బాధ్యతలు స్వీకరించారు. టీసీఎస్ నుంచి విప్రోకు వచ్చిన ఆయన.. 2016 ఫిబ్రవరిలో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. కొత్త సీఈవో ఎంపిక కోసం చర్యలు చేపట్టామని విప్రో తెలిపింది. తదుపరి సీఈవో బాధ్యతలు చేపట్టే వరకు అబిద్ ఆ పదవిలో కొనసాగుతారు.