స్మగ్లింగ్ కోసం భారీ సొరంగం నిర్మించిన కేటుగాళ్లు!
మెక్సికో: డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం కొందరు కేటుగాళ్లు ఏకంగా ఓ భారీ సొరంగాన్నే తవ్విన వైనమిది. కేవలం ఒక మనిషి పట్టేలా రెండు అడుగుల వెడల్పు, ఐదున్నర అడుగుల ఎత్తులో అత్యంత నేర్పుగా దీన్ని తవ్వారు. మెక్సికో సరిహద్దు వద్ద తాము ఈ సొరంగాన్ని కనిపెట్టినట్టు అమెరికా అధికారులు ప్రకటించారు. 4,309 అడుగుల పొడవున్న ఈ రహస్య మార్గంలో ఓ లిఫ్ట్, రైల్వే ట్రాక్, డ్రైనేజీ, ఎయిర్ వెంటిలేటర్లు, హై ఓల్టేజ్ విద్యుత్ కేబుళ్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి మెక్సికోలోని టిజువానా పారిశ్రామిక ప్రాంతాన్ని కలుపుతూ ఈ సొరంగాన్ని నిర్మించారు. కాగా ఈ సొరంగానికి సంబంధించిన ఎవరినీ అరెస్ట్ చేయలేదనీ.. ఇందులో ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదని అధికారులు వెల్లడించారు.