
దేశాభివృద్ధికి ఈ దశాబ్దం కీలకం: రాష్ట్రపతి
న్యూఢిల్లీ: నవభారత నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, దేశానికి, దేశాభివృద్ధికి ఈ దశాబ్దం ఎంతో కీలకమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. గాంధీజీ, నెహ్రూజీ కలలను ఆ దశాబ్దం నెరవేర్చనుందని పేర్కొన్నారు. రాజ్యాంగం మనకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. దేశ ప్రయోజనాలే కీలకమని, ఇందుకోసం అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బడ్జెట్ సమావేశాలు-2020 ప్రారంభం సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల సమవేశాలను ఎంపీలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.
న్యూ ఇండియాకు ప్రజలు తీర్పు ఇచ్చారని, గత ఏడాది పలు చారిత్రక చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన చెప్పారు. రాజ్యాంగం ప్రకారం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని భరోసా ఇచ్చారు. 'సబ్ కా సాత్...' లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు గత సెషన్స్‌లో రికార్డు సృష్టించాయనీ, కీలక బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించిందని చెప్పారు.
ముస్లిం మహిళలకు న్యాయం జరిగేలా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. 370 అధికరణ రద్దు చరిత్రాత్మకమని అభివర్ణించారు. కశ్మీర్ అభివృద్ధి బాట పట్టిందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను అనుగుణంగానే ప్రభుత్వం కొత్త పథకాలు, కొత్త చట్టాలు తీసుకువచ్చిందన తెలిపారు.రామజన్మభూమిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రజలు చూపిన ఔన్నత్యం ప్రశంసనీయమని రాష్ట్రపతి కొనియాడారు.
ప్రజాస్వామ్యాన్ని హింస బలహీన పరుస్తుంది..
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రాష్ట్రపతి ప్రస్తుతించారు. అందరికీ సమాన హక్కులు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. సీఏఏతో గాంధీజీ కలలు నిజమయ్యాయని అన్నారు. నిరసనల పేరుతో హింస తగదన్నారు. సమాజాన్ని, ప్రజాస్వామ్యాన్ని హింస బలహీన పరుస్తుందని అన్నారు. రాష్ట్రపతి వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా, విపక్ష బెంచీల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి.