దారుణం.. కుటుంబాన్ని హత్య చేసిన మైనర్
భోపాల్ : ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు తల్లిదండ్రులను అత్యంత దారుణంగా హతమార్చాడు. అడ్డు వచ్చిన సోదరుడిని సైతం అక్కడిక్కడే మట్టుబెట్టాడు. ఈ ఘటనలో ముగ్గురినీ హత్య చేసిన వ్యక్తి మైనర్ బాలుడు కావడం గమనార్హం. ఈ క్రూరమైన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సాగర్ జిల్లాలోని మాక్రోనియాకు చెందిన 17 ఏళ్ల యువకుడు తన తల్లిందడ్రులతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 24న బాలుడు తన అవసరాల కోసం తల్లిని రూ.1500 డిమాండ్ చేశాడు.(నిర్భయ కేసు : ఉరి అమలు ఆ ముగ్గురికే..!)
అందుకు తల్లి నిరాకరించడంతో కోపానికి గురైన యువకుడు దుప్పట్టితో గొంతు నులిపి హతమార్చాడు. అయినప్పటికీ తల్లి చనిపోకపోవడంతో ఇంట్లో ఉన్న లైసెన్స్ తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం కొంత సమయం తర్వాత ఇంట్లోకి వచ్చిన తండ్రితో గొడవపడి అతని శరీరంపై రెండు బుల్లెట్లు దింపి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా అడ్డు వచ్చన తమ్ముడిని కూడా గొంతు కోసి హతమార్చాడు. అనంతరం అందరి మృతదేహాలను ఒకే గదిలో ఉంచి తాళం వేసి.. అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీన పరుచుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటనాస్థలంలో ఓ లేఖను పోలీసులు కనుగొన్నారు. ‘ఈ చర్యకు నేను బాధ్యత వహిస్తున్నాను. నేను చనిపోతున్నా.. నాకోసం వెతకొద్దు’ అంటూ లేఖలో రాసుంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ దుకాణం నుంచి సిమ్ కార్డు కొంటున్న బాలుడిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ నిమిత్తం అతడిని జువైనల్ హోంకు తరలించినట్లు జిల్లా ఎస్పీ అమిత్ సంఘి తెలిపారు.