చైనా నుంచి వచ్చే విద్యార్థుల కోసం..
న్యూఢిల్లీ : చైనాను కరోనా వైరస్ వణికిస్తున్న వేళ.. అక్కడి నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం చైనా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలోనే వుహాన్ నగరంలోని భారతీయులను భారత్‌కు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వుహాన్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు బోయింగ్ 747 విమానాన్ని పంపింది. విమానంలో ఐదుగురు వైద్యులను కూడా తరలించింది. ఈ విమానం శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ఢిల్లీ చేరుకోనుంది. దాదాపు 300 మంది విద్యార్థులు ఈ విమానం ద్వారా ఇండియాకు చేరుకోనున్నారు.
అయితే చైనా నుంచి భారత్‌కు చేరుకున్న విద్యార్థులకు పూర్తిస్థాయిలో వైద్యుల పరిశీలనలో ఉంచడానికి ఆర్మీ అధికారులు ఢిల్లీకి సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. బీహెచ్‌డీసీలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న విద్యార్థుల్లో వైరస్ లక్షణాలు ఉన్నవారిని రెండు వారాల పాటు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచనున్నారు.
తొలుత చైనా నుంచి విద్యార్థులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే వారికి పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను మూడు వర్గాలకు విభజించి పరీక్షలు చేపడతారు. అందులో ఎవరికైనా వైరస్ సోకినట్టు అనుమానం వస్తే వారిని బీహెచ్‌డీసీలోని ప్రత్యేక వార్డులకు తరలిస్తారు. ప్రత్యేక వార్డులో చేరినవారికి రోజువారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 14 రోజులు తర్వాత వారిలో వైరస్ లక్షణాలు కనిపించకపోతే వారిని ఇళ్లకు పంపిస్తారు. కాగా, చైనా నుంచి తిరిగివచ్చిన కేరళ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు గురువారం నిర్ధారణ అయింది. దీంతో ఆ విద్యార్థి ప్రత్యేక గదిలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.
చదవండి : షాపు ముందు శవం.. భయం వేస్తోంది