https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/01/31/Nirbhaya%20case.jpg?itok=4Z2dgcgJ

నిర్భయ కేసు: పవన్‌ గుప్తాకు సుప్రీంకోర్టు షాక్‌

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. నిర్భయ సామూహిక అత్యాచారం జరిగిన సమయంలో తాను మైనర్‌ను అని వేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సమీక్షించాలంటూ.. పవన్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌ రివ్యూ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ ఆర్‌ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం.. దానిని కొట్టివేసింది. కాగా ఢిల్లీ కోర్టు తీర్పు మేరకు నిర్భయ దోషులు ముకేశ్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌,  పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే.(మొన్న ముఖేష్‌.. నిన్న వినయ్‌ శర్మ.. నేడు అక్షయ్‌)

ఈ నేపథ్యంలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు, ఉరి అమలును వాయిదా వేసేందుకు దోషులు అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. వరుస పిటిషన్లు దాఖలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. అదే విధంగా ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతున్నారు. ఈ క్రమంలో వినయ్‌ శర్మ తాజాగా క్షమాభిక్ష అభ్యర్థించిన నేపథ్యంలో మిగిలిన ముగ్గురు దోషులను ఉరితీసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా ఏడేళ్ల క్రితం దేశ రాజధానిలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై ఆరుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి గురిచేసి దారుణంగా హింసించగా.. సింగపూర్‌లో చికిత్స పొందుతూ ఆమె మరణించిన విషయం విదితమే. ఈ కేసులో ప్రధాన దోషి రామ్‌ సింగ్‌ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. ఘటన నాటికి మైనర్‌గా ఉన్న మరో నిందితుడు విడుదలయ్యాడు.(నిర్భయ కేసు : ఉరి అమలు ఆ ముగ్గురికే..!)

నిర్భయ దోషుల వివరాలు
ముఖేష్‌ సింగ్‌: తీహార్‌ జైల్లో ఉరి వేసుకొని చనిపోయిన బస్సు డ్రైవర్‌ రామ్‌ సింగ్‌ తమ్ముడే ముఖేష్‌  సింగ్‌ (32). దక్షిణ ఢిల్లీలోని రవిదాస్‌ మురికివాడల్లో సోదరుడితో కలసి నివసించేవాడు అప్పుడప్పుడు తానే ఆ బస్సుని నడిపించేవాడు. క్లీనర్‌గా చేసేవాడు.  ఘటన రోజు ముఖేశ్‌ బస్సు నడిపాడు. అత్యాచారం చేశాక నిర్భయ, ఆమె స్నేహితుడిని ఐరన్‌ రాడ్‌తో చితకబాదాడని ముఖేష్‌పై అభియోగాలు నమోదయ్యాయి.

వినయ్‌ శర్మ: వినయ్‌శర్మ (26) కూడా రవిదాస్‌ మురికివాడల్లో నివసించే వాడు. అతను ఫిటినెస్‌ ట్రైనర్‌. ఒక జిమ్‌లో అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ప్రాథమిక విద్య అభ్యసించాడు.

అక్షయ్‌ కుమార్‌ ఠాకూర్‌: అక్షయ్‌ ఠాకూర్‌ (31) బిహార్‌ వాసి. నిర్భయను అత్యాచారం చేసిన బస్సులో హెల్పర్‌గా ఉన్నాడు. స్కూల్‌ డ్రాపవుట్‌ అయిన అక్షయ్‌ 2011లో బిహార్‌ నుంచి ఢిల్లీకి వచ్చాడు. నేరం చేయడమే కాదు సాక్ష్యాధారాల్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. నేరం జరిగిన ఐదు రోజుల తర్వాత అక్షయ్‌ని బిహార్‌లో అరెస్ట్‌ చేశారు.

పవన్‌ గుప్తా: పవన్‌ గుప్తా (25) పండ్ల వ్యాపారి. డిసెంబర్‌ 16 మధ్యాహ్నం మద్యం సేవించి బయటకు వెళ్లాడు. అరెస్ట్‌ చేసిన తర్వాత పవన్‌ తాను చాలా దుర్మార్గానికి పాల్పడ్డానని, తనకి ఉరి శిక్షే సరైనదని కోర్టులో చెప్పుకున్నాడు.