https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2020//Jan//20200131//Hyderabad//637160648873949463.jpg

సెకండ్స్‌లో బైక్ కొనాలనుకునే వారి కోసం...

సామాన్య ప్రజల పాలిట వరం వినియోగించిన ద్విచక్ర వాహనాలు. మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఆదరించేది వినియోగించిన ద్విచక్ర వాహనాలే. నేటి యువతరం, మహిళలు, మధ్య తరగతి ఉద్యోగులు ఆటోఛార్జీలు, బస్సు ఛార్జీలు తడపి మోపెడు అవుతున్నాయని లెక్కలేసుకొని ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్ము పెట్టలేక పోవడం, ఒకవేళ బండిని ఫైనాన్స్‌లో తీసుకున్నా ప్రతినెలా ఇన్‌స్టాల్‌మెంటులో సొమ్ము చెల్లించే పరిస్థితి ఉండటంతో ఎక్కువ శాతం ప్రజలు వినియోగించిన ద్విచక్ర వాహనాల మీద మోజు పడుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో ప్రతినెలా వాహనాల మోడల్స్‌ మారిపోతుండటంతో యువతరం వినియోగించిన వాహనాల కోసం ఎగబడుతున్నారు. మార్కెట్‌లో కొత్త మోడల్‌ వస్తే సుమారుగా నెల నుంచి రెండవ నెలలోపు ఈ దుకాణాల దగ్గర ప్రత్యక్షం అవుతుంటాయి.

 

వినియోగదారులు తమకు కావాల్సిన మోడల్‌, రంగు, డబ్బులు తదితర వివరాలు ముందుగా చెబితే అందుకు తగ్గట్టు బళ్ళను సిద్ధం చేస్తారు. ఈ తరహా దుకాణాలు విశాఖ పరిధిలో దొండపర్తి, రైల్వే న్యూకాలనీ, ముస్లిం తాటిచెట్లపాలెం, గాజువాక, గోపాలపట్నం, మధురవాడ వంటి పలు ఏరియాలలో ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా ప్రతినెలా 200నుండి 300వరకు బళ్ళ అమ్మకాలు నిర్వహిస్తుంటారు.

 హోండా ఏక్టివా, హీరో, బజాజ్‌, టీవీఎస్‌ మోడల్‌ వాహనాలకు గిరాకి వుంటుందని, అదే కార్లలో మారుతి, టాటా వంటి కంపెనీలకు మంచి గిరాకి ఉంటుందని విక్రయదారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆటో మొబైల్‌ రంగంపై ఆర్థిక మాంధ్యం ప్రభావం పాత వాహన కొనుగోళ్ళు, విక్రయాలపై కూడా భారీగానే ఉంది. గతంలో జోరుగా సాగినక్రయ విక్రయాలు నేడు మందగించాయని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఏదేమయినా మధ్యతరగతి వినియోగదారులు ఉన్నంతకాలం వినియోగించిన వాహనాలకు గిరాకీ ఎప్పుడూ ఉంటుంది. 

సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలే బెస్ట్‌

సెకండ్‌హ్యాండ్‌ వాహనాలు కొనుగోలు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకేసారి మదుపు పెట్టి కొత్త వాహనం కొనేబదులు పాత వాహనం కొనుగోలు చేయడం వలన డబ్బు ఆదా అవుతుంది. ఫైనాన్స్‌ సౌకర్యం ఉంటుంది కాబట్టి కొనాలంటే మరింత సులభం. మధ్యతరగతి వారికి సెకండ్‌హ్యాండ్‌ వాహనాలే బెస్ట్‌.

- గుప్తా కోడూరు, వినియోగదారుడు

వ్యాపారాలు తగ్గాయి

గతంలో నెలకు 100 వరకు అమ్మేవారం, కానీ ప్రస్తుత పరిస్థితులలో సగానికి తగ్గింది. షోరూం వారే కొత్త వాహనాలకు తక్కువ డౌన్‌పేమెంటుకు వాహనాలు ఇవ్వడంతో కొనుగోలుదారులు కొత్తవాహనాలపై మొగ్గు చూపిస్తున్నారు. గత దసరా నుంచి వ్యాపారాలు బాగా తగ్గాయి.

- అలపాటి శ్రీనివాస్‌, షోరూం అధినేత