కోహ్లి మెరుపు ఫీల్డింగ్.. మున్రో బ్యాడ్ లక్
వెల్లింగ్టన్: పరుగుల మెషీన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాట్‌తోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. అద్భుతమైన క్యాచ్‌లతో పాటు ఫీల్డింగ్‌లో పాదరసంలా కదులుతున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో నాల్గో టీ20లో కోహ్లి చేసిన రనౌట్ ఔరా అనిపించింది. సిక్స్‌లు, ఫోర్లతో విజృంభించి ఆడుతున్న న్యూజిలాండ్ ఓపెనర్ కొలిన్ మున్రోను కోహ్లి రనౌట్ చేసిన తీరు అబ్బురపరిచింది. శివం దూబే వేసిన 12 ఓవర్ నాల్గో బంతిని కవర్స్ మీదుగా షాట్ కొట్టాడు మున్రో. అయితే బౌండరీ లైన్ సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న శార్దూల్ ఠాకూర్ బంతిని అందుకున్న మరుక్షణమే షార్ట్ కవర్స్‌లో ఉన్న కోహ్లికి అందించాడు. (ఇక్కడ చదవండి: అజామ్ తర్వాత రాహులే..!)
బంతిని అందుకున్న కోహ్లి అంతే వేగంతో స్ట్రైకింగ్ ఎండ్‌లోకి విసిరి వికెట్లను గిరటేశాడు. అప్పటికి ఒక పరుగు తీసి మరో పరుగు కోసం యత్నిస్తున్న మున్రో రనౌట్ అయ్యాడు. సాధారణంగా అయితే దానికి రెండు పరుగులు వచ్చేవి. కానీ ఠాకూర్, కోహ్లి ఎఫర్ట్‌తో అది పరుగు రాగా, న్యూజిలాండ్ కీలక వికెట్‌ను కోల్పోయింది. రెండు పరుగు తీసే క్రమంలో మున్రో కాస్త రిలాక్స్ కావడం కూడా భారత్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి. ఇది నిజంగా మున్రో బ్యాడ్ లక్. 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 పరుగులు సాధించి మున్రో రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై టామ్ బ్రూస్ డకౌట్ అయ్యాడు. చహల్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు గప్టిల్(4) తొలి వికెట్‌గా ఔటయ్యాడు.