https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/01/31/taapsee-pannu.jpg?itok=ep6Cd4wj

వేరే సంబంధాలు ఉన్నాయా.. ఒక్క చెంపదెబ్బే కదా!



టాలీవుడ్‌ ద్వారా వెండితెరకు పరిచయమైన ఢిల్లీ భామ తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. తొలుత గ్లామర్‌ డాల్‌ పాత్రలకే పరిమితమైన తాప్సీ.. ఇటీవల కాలంలో నటనకు ఆస్కారం ఉన్న, సందేశాత్మక పాత్రల్లో మెప్పిస్తూ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంటున్నారు. ఆమె నటించిన పింక్‌, బేబీ, నామ్‌ షబానా, ముల్క్‌, బద్లా, సాంధ్‌ కీ ఆంఖ్‌ చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఇక సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే తాప్సీ తాజాగా నటిస్తున్న చిత్రం థప్పడ్‌(చెంపదెబ్బ అని అర్థం). ముల్క్‌, ఆర్టికల్‌ 15 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది.(థాంక్యూ తాప్సీ: మిథాలీ రాజ్‌)

ఇక గృహిణిగా సంతోషకరమైన జీవితం గడుపుతున్న ఓ మహిళ జీవితం.. భర్త అందరి ముందూ తనను కొట్టిన ఒకే ఒక్క చెంపదెబ్బతో ఎలాంటి మలుపు తీసుకుంది... తన ఆత్మగౌరవం, భర్త చేత క్షమాపణ చెప్పించడం కోసం చట్టప్రకారం ఆమె పోరాడిన తీరు ఇతివృత్తంగా సినిమా రూపొందినట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. భర్తను ప్రేమగా చూసుకుంటూ.. అతడికి అన్ని సౌకర్యాలు అమర్చిపెట్టే భార్య నుంచి.. ప్రతీ బంధంలోనూ సర్దుబాట్లే తప్ప నిజమైన ప్రేమ ఉండదని గ్రహించానంటూ తాప్సీ చెప్పే డైలాగులు... విడాకుల కోసం లాయర్ దగ్గరికి వెళ్తే.. నీ భర్తకు లేదా నీకు వివాహేతర సంబంధం ఉందా.. ఒక్క చెంపదెబ్బకే విడాకుల దాకా వెళ్తావా అంటూ లాయర్‌ ప్రశ్నించే తీరు.. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దంటూ తల్లి తాప్సీకి చెప్పే మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఇక థప్పడ్‌ ట్రైలర్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాతో తాప్సీ నటిగా మరో మెట్టు ఎక్కడం ఖాయం అంటూ ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. (ఓకే సార్‌... నాకు థెరపీ సెషన్స్‌ ఎప్పుడు మొదలుపెడుతున్నారు?)