మేల్ ఎస్కార్ట్స్ కావలెను.. నెలకు ఐదంకెల జీతమని చెప్పి...!
ఎస్కార్ట్ వల...!
మేల్ ఎస్కార్ట్స్ ఉద్యోగాలంటూ తప్పుడు ప్రకటనలు
బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన మోసం
నిందితుడిని విచారించేందుకు పోలీసులు సన్నద్ధం
అందమైన అమ్మాయితో డేటింగ్ చేయడానికి ఒడ్డు పొడుగున్న యువకుడు కావాలి... దేహదారుఢ్యం ఉందా, అయితే... ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలకు తోడుగా ఉంటే చాలు.. వేలాది రూపాయల జీతం ఇస్తాం. ఫోన్‌లో చలాకీగా మాట్లాడే గొంతు ఉంటే ఉద్యోగంతో పాటు
అదనపు సదుపాయాలు కల్పిస్తామని యువతకు గాలం వేస్తూ మోసాలకు పాల్పడే వెబ్‌సైట్లు కొన్ని ఉన్నాయి. మగ వ్యభిచారులు కావాలి...నెలకు ఐదు అంకెల జీతం అంటూ కుర్రకారును ఆకర్షించి, వారి వద్ద డబ్బు వసూలు చేసేవి మరికొన్ని ఉన్నాయి. ఇలాంటి వెబ్‌సైట్‌లో డబ్బు చెల్లించామని బయటకు తెలిస్తే పరువు పోతుందని బాధితులు బయటకు చెప్పరు. ఓ వ్యక్తి లొకాంటో వెబ్‌సైట్ పేరు చెప్పి జరిగిన ఇలాంటి మోసంపై పోలీసులను ఆశ్రయించాడు.
లొకాంటో డాట్ కామ్ పేరిట యువకులను మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని కస్టడీకి తీసుకొని విచారించేందుకు సీసీఎస్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు వెలుగులోకి వచ్చిన ఈ కేసు విచారణలో పోలీసులు అసక్తికరమైన అంశాలను గుర్తించారు. ఇప్పటి వరకు ఎనిమిది మందిని మోసం చేసినట్లు నిందితుడు చెబుతున్నప్పటికీ బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీసీఎస్ ఏసీపీ కేవీఎన్ ప్రసాద్ తెలిపారు. కవాడిగూడ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఈ నెల 22న సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో లొకాంటో పేరిట మోసం వెలుగు చూసింది. దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్ మేల్ ఎస్కార్ట్స్ కావాలంటూ ఉద్యోగావకాశాలు కల్పిస్తానంటూ ఆన్‌లైన్‌లో అసత్య ప్రకటనలు చేశాడు. రెండురోజుల్లో ఉద్యోగం.. నెలకు రూ. 25 వేల నుంచి 50 వేల జీతం అని మభ్యపెట్టసాగాడు. అతడిని నమ్మిన ఓ బాధితుడికి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి తనను తాను సాయిగా పరిచయం చేసుకున్నాడు.
కవాడిగూడ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి మేల్ ఎస్కార్ట్ ఉద్యోగం పేరిట ఆఫర్ ఇచ్చాడు. అందమైన మహిళలు, యువతుల ఫొటోలు పంపించి.. వారికి ఎస్కార్ట్‌గా వెళ్లాలని నమ్మించాడు. రిజిస్ట్రేషన్ పేరిట ఆన్‌లైన్‌లో రూ. 4 వేలు తీసుకున్నాడు. కారు బుకింగ్ పేరిట మరో రూ. 4 వేలు తీసుకున్నాడు. క్యాబ్ పంపించి లొకేషన్‌కు వెళ్లాలని చెప్పాడు.
ఎన్నో భ్రమలతో కారెక్కిన బాధితుడికి ఫోన్‌లో మెసేజ్ రూపంలో ఓ లిస్టు వచ్చింది. వచ్చే ముందు ఆ లిస్టులో ఉన్న కాస్మెటిక్ సామగ్రి తీసుకురావాలని అందులో ఉంది. వెంటనే సాయికి ఫోన్ చేస్తే రూ. 10 వేలు పంపిస్తే ఆ సామగ్రి సమకూరుస్తానన్నాడు. దీంతో తన అకౌంట్‌లో ఉన్న రూ. 9వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. లొకేషన్ వద్ద కారు దిగిన తర్వాత అక్కడ ఎవరూ లేకపోవడంతో సాయికి ఫోన్ చేశాడు. అతడు స్పందించకపోవడంతో బాధితుడు సీసీఎ్‌సను ఆశ్రయించాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అతడిని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొంతమంది బాధితుల వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.