ఇన్సూరెన్స్‌ డబ్బు కావాలా అంటూ మోసం..

రూ. లక్ష వసూలు.. మోసగాడి అరెస్టు

బంజారాహిల్స్‌(ఆంధ్రజ్యోతి): ఇన్సూరెన్స్‌ డబ్బు కావాలా.. ట్యాక్స్‌ల కింద లక్ష రూపాయలు వసూలు చేసిన మోసగాడిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. మీ నాన్నకు సంబంధించిన ఇన్సూరెన్స్‌ తాలూకు రూ. 19 లక్షలు క్లెయిమ్‌ వచ్చిందని ఓ వ్యక్తి నగరానికి చెందిన ఉద్యోగికి ఫోన్‌ చేశాడు. ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కావాలంటే ట్యాక్స్‌ల కింద రూ. 3.20 లక్షలు ముందుగా కట్టాలని చెప్పాడు. డబ్బు కట్టకపోతే క్లెయిమ్‌ వెనక్కి వెళ్లిపోతుందని హెచ్చరించాడు. దీంతో బాధితుడు బ్యాంకు ద్వారా ఫోన్‌ చేసిన వ్యక్తికి డబ్బు పంపించాడు. ఆ తర్వాత ఫోన్‌ సిచ్చాఫ్‌ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా నిందితుడు కరీంనగర్‌కు చెందిన బానాల మధు అని తేలింది. అతడు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నాడు. గతంలో పలువురు జెడ్‌పీటీసీలకు ఫోన్‌ చేసి సెంట్రల్‌ గవర్నమెంట్‌ నుంచి నిధులు తెప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడు. దీనిపై సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రత్యేక పోలీసు బృందం కరీంనగర్‌ వెళ్లి నిందితుడిని అరెస్టు చేసింది. అతడి నుంచి రెండు తులాల బంగారు గొలుసు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.