https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/01/31/china.jpg?itok=esXQROwt

నిర్మానుష్య వీధిలో శవం.. భయం వేస్తోంది



వుహాన్/చైనా‌: కరోనా వైరస్‌ రోజురోజుకీ విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. చైనాలోని వుహాన్‌ పట్టణంలో బయటపడ్డ ఈ ప్రాణాంతక వైరస్‌ కారణంగా ఇప్పటికే వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం వైరస్‌ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే.. నివారణకు వ్యాక్సిన్‌ కనుగొనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే తాజాగా వుహాన్‌ పట్టణంలోని నిర్మానుష్య వీధిలో ఓ షాపు ముందు వ్యక్తి విగతజీవిగా పడి ఉండటం కలకలం రేపింది. అతడు కరోనా వైరస్‌ కారణంగానే మృతి చెందాడని.. వైరస్‌ తీవ్రత ఏమాత్రం తగ్గలేదంటూ స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడి దగ్గరికి వెళ్లడానికి ఒక్కరు కూడా సాహసం చేయలేదు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు, వైద్యాధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అతడి మృతదేహాన్ని సర్జికల్‌ బ్యాగులో చుట్టి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపడంతో పాటుగా.. పరిసర ప్రాంతాలను పూర్తిగా శుభ్రం చేశారు. (48 గంటల్లో వెయ్యి పడకలుగల అత్యవసర ఆస్పత్రి)

కాగా గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని చూసి.. స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. కరోనా ధాటికి చైనా వ్యాప్తంగా 213 మంది మరణించగా.. అందులో దాదాపు 159 మరణాలు వుహాన్‌లో సంభవించిన కారణంగా రోజురోజుకు పరిస్థితి చేజారిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం గంటల తరబడి ఆస్పత్రుల వద్ద వేచి చూస్తున్నామని... వరుసలో నిలబడే ఓపిక లేక ఇంటి నుంచి కుర్చీలు తెచ్చుకుని డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం నిరీక్షిస్తున్నామని అంతర్జాతీయ మీడియా ముందు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇక తాజా ఘటన గురించి ఓ మహిళ మాట్లాడుతూ.. ‘నాకు చాలా భయం వేసింది. ఇప్పటికే వుహాన్‌లో చాలా మంది చనిపోయారు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు’ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా చనిపోయిన వ్యక్తి గురించి ఆరా తీసేందుకు, అతడి మరణానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు రిపోర్టర్లు ప్రయత్నించగా.. స్పందించడానికి వైద్యాధికారులు నిరాకరించినట్లు సమాచారం. (కరోనా వైరస్‌తో ఎంతటి ముప్పు!?.. ఎక్కడ పుట్టింది? ఎలా విస్తరిస్తుంది?)

కరోనాపై పోరాటానికి 103 కోట్లు విరాళం