https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/01/31/begers.jpg?itok=G2vaPzoK
జగన్నాథ మందిరం ఆవరణలో భిక్షాటన

బిచ్చగాళ్లకు వృత్తి శిక్షణ



ఒడిశా,భువనేశ్వర్‌: రాష్ట్రంలో బిచ్చగాళ్ల నిర్మూలనకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ మేరకు బిచ్చగాళ్లకు వృత్తి శిక్షణ కల్పిస్తారు. ఈ వర్గానికి జీవనోపాధి వనరులతో పునరావాసం కల్పించే ధ్యేయంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర సాంఘిక భద్రత–దివ్యాంగుల సాధికారత విభాగం మంత్రి అశోక్‌ చంద్ర పండా గురువారం తెలిపారు. పూరీ పట్టణంలో జగన్నాథ మందిరం, భువనేశ్వర్‌లో లింగరాజ్‌ దేవస్థానాన్ని బహుముఖంగా విస్తరించి అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక, పుణ్య క్షేత్రాలుగా ఆవిష్కరించేందుకు భారీ ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం చకచకా పనులు చేపడుతుంది. ఈ దేవస్థానాల ప్రాంగణాల్లో బిచ్చగాళ్లకు త్వరలో పునరావాసం కల్పించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో వీరికి వృత్తి శిక్షణ కల్పిచండం ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం గుర్తించింది. తొలి విడతలో పూరీ, భువనేశ్వర్‌ ప్రాంతాల్లో బిచ్చగాళ్లకు వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతాల్లో రహదారుల పక్కన భిక్షాటన చేసే వారిని గుర్తించి శిక్షణ కేంద్రాలకు తరలిస్తారు. శిక్షణ అనంతరం వీరు చిరు వ్యాపారం వంటి వ్యాపకాలతో జీవనం సాగించేందుకు ప్రేరణగా ఈ శిక్షణ దోహదపడుతుందని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటనను నిర్మూలించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అంచెలంచెలుగా అన్ని జిల్లాల్లో బిచ్చగాళ్లకు వృత్తి శిక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.