https://www.ntnews.com/updates/latestnews/2019/2-spp.jpg

లింగాపూర్‌ హత్యాచార బాధితురాలి పేరు ‘సమత’గా మార్పు..

ఆసిఫాబాద్‌: కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని లింగాపూర్‌ మండలం ఎల్లపటూర్‌ గ్రామానికి చెందిన దళిత మహిళ.. గత నెల 24న ముగ్గురు దుండగుల చేతిలో హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. హత్యకు గురైన ఆ మహిళ పేరు టేకులక్ష్మీ కాగా.. కలెక్టర్‌ కార్యాలయం ఆమె పేరును ‘సమత’గా మార్చింది. వారి కుటుంబ గౌరవ నిమిత్తం పేరు మార్చినట్లు కలెక్టర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇక ముందు ఈ కేసుకు సంబంధించిన ఏ వార్త అయినా సమత పేరుతో రాయాలని మీడియాకు తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి వారం రోజుల్లో చార్జీషీట్‌-ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు తెలిపారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం నుంచి సహాయం అదుతుందని కలెక్టర్‌ తెలియజేశారు. ఈ కేసు నమోదయిన నుంచి పోలీసులు అన్ని సాక్ష్యాలు సేకరించారు. ఈ ఘోరానికి పాల్పడ్డ దోషులను వెంటనే అరెస్టు చేసి, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి సంబంధిత ప్రభుత్వ వైద్యుల నుంచి నివేదిక తీసుకోవడం జరిగిందని ఎస్పీ మల్లారెడ్డి తెలియజేశారు. ఈ కేసును సవాలుగా స్వీకరించిన జిల్లా ఎస్పీ ఈ వారాంతానికి అన్ని సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెడతారు. దారుణానికి ఒడిగట్టిన దోషులను కఠినంగా శిక్ష పడేలా చేస్తామని జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కలెక్టర్‌ కార్యాలయం ప్రభుత్వానికి నివేదిక పంపింది.

ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం అందించారు. చార్జీషీటు దాఖలు చేసిన అనంతరం ఇంకా రావాల్సిన పరిహారం అందనుంది. మృతురాలి ఇద్దరు పిల్లలను తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేర్పించి విద్య అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మృతురాలి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ప్రతినెలా పెన్షన్‌, డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకుంటున్నారు. నిందితులకు చట్ట పరిధిలో తక్షణమే కఠినమైన శిక్ష విధించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామనీ, కావున ప్రజలంతా సంయమనం పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.