https://www.ntnews.com/updates/latestnews/2019/2-russiawada.jpg

ర‌ష్యాపై నిషేధం.. టోక్యో ఒలింపిక్స్‌కు దూరం

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ.. ర‌ష్యా అథ్లెట్ల‌పై వేటు వేసింది. ఆ దేశ క్రీడాకారులు నాలుగేళ్ల పాటు ఒలింపిక్స్‌కు ఆడ‌రాదు అని నిషేధం విధించింది. దీంతో ఆ దేశం 2020లో టోక్యోలో జ‌రిగే క్రీడ‌ల‌కు దూరంకానున్న‌ది. 2022లో ఖ‌తార్‌లో జ‌రిగే ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కూడా ర‌ష్యా పాల్గొన‌డంలేదు. అయితే డోపింగ్‌లో దోషిగా తేలిన అథ్లెట్లకు మాత్రం.. త‌ట‌స్థ జాతీయ జెండాతో మెగా టోర్నీల్లో పాల్గొనే అవ‌కాశం క‌ల్పించారు. స్విట్జ‌ర్లాండ్‌లోని లౌసానేలో ఇవాళ జ‌రిగిన స‌మావేశంలో వాడా ఎగ్జిక్యూటివ్ క‌మిటీ ఏక‌గ్రీవ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ప‌రిశోధ‌న‌శాల‌లో ఉన్న అథ్లెట్ల డేటాను మార్చినందుకు ర‌ష్యాపై యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈ చ‌ర్య‌కు పూనుకున్న‌ది. అయితే ఈ బ్యాన్‌పై అప్పిల్ చేసుకునేందుకు ర‌ష్యాకు 21 రోజుల గ‌డువు నిర్ణ‌యించారు. ర‌ష్యాపై కేవ‌లం నిషేధం విధించ‌డం స‌రిపోదు అని వాడా ఉపాధ్య‌క్షుడు లిండా హెల్లేలాండ్ తెలిపారు. 2018లో జ‌రిగిన వింట‌ర్ ఒలింపిక్స్‌లో సుమారు 168 మంది ర‌ష్యా అథ్లెట్లు త‌ట‌స్థ జెండాపై పోటీలో దిగారు. 2015 నుంచి అథ్లెటిక్స్‌లో ర‌ష్యా ప్లేయ‌ర్ల‌పై నిషేధం ఉన్న‌ది. అయితే 2020లో సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో జ‌రిగే యురో చాంపియ‌న్‌షిప్‌లో ర‌ష్యా పాల్గొన‌నున్న‌ది.