రేప్ కేసుల పరిష్కారానికి 218 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
లక్నో : ఉన్నావ్ అత్యాచార బాధితురాలి సజీవదహన అనంతరం నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర ప్రజల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని యూపీ సర్కార్‌పై ప్రజలు ఒత్తిడి తెస్తున్నారు. నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వానికి ప్రజలు విన్నవిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై మహిళలు, చిన్నారులపై లైంగికదాడులు, వేధింపుల సమస్యల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 218 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంట్లో 144 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులేమో మహిళలపై అత్యాచార కేసులకు, మిగతా 74 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులేమో చిన్నారులపై అఘాయిత్యాలు జరిగినప్పుడు త్వరితగతిన విచారించి శిక్ష విధించనున్నాయి. ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని సజీవదహనం చేయడంతో సీఎం యోగి.. నిందితులపై ఆగ్రహంగా ఉన్నారు.