https://www.ntnews.com/updates/latestnews/2019/apcmjagan0912.jpg

హ్యాట్సాఫ్ కేసీఆర్‌ : ఏపీ సీఎం జగన్‌

అమరావతి : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ ఏపీ అసెంబ్లీ సాక్షిగా అభినందించారు. దిశ హత్యాచార కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం జరగకూడని పరిస్థితిలోనే జరిగిందని జగన్‌ పేర్కొన్నారు. దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేస్తే ఎన్‌హెచ్‌ఆర్సీ ఎందుకు వచ్చి నిలదీస్తుందని ఆయన ప్రశ్నించారు. నిర్భయ నిందితులకు ఇంకా శిక్ష పడలేదు. దీనిపై ఏం సమాధానం చెబుతారని జగన్‌ అడిగారు.

ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రతపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. దిశ హత్యాచార కేసు సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన. దిశపై అత్యాచారం చేసి కాల్చేసిన ఘటన దారుణం. దిశ ఘటనను చూసిన తర్వాత ఆమె తల్లిదండ్రుల పడిన ఆవేదన చూసిన నిందితులను కాల్చేసిన పర్వాలేదనుకున్నాను. నాకు భార్య, పిల్లలు, చెల్లి ఉంది. మన ఇంట్లో ఇలాంటి ఘటనలు జరిగితే మనం ఊరుకుంటామా? నిందితులకు ఏరకమైన శిక్ష పడితే తనకు ఉపశమనం కలుగుతుందో ఆలోచించాలి. వాళ్లకు ఏ రకమైన శిక్ష పడితే ఉపశమనం కలుగుతుందో దాన్నే తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. హ్యాట్సాఫ్ టూ కేసీఆర్, తెలంగాణ పోలీసులు. జరగకూడని పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగింది.

నిజజీవితంలో దమ్మున్నోళ్లు ఎవరైనా చేస్తే ఎన్‌హెచ్‌ఆర్సీ ఢిల్లీ నుంచి పరుగెత్తుకుంటూ ఎందుకు వచ్చింది. నిందితులను ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేశారని ప్రశ్నిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. దారుణమైన పరిస్థితుల్లో చట్టాలు ఉన్నాయి. ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత నిర్భయ చట్టం తీసుకువచ్చాం. నాలుగు నెలల్లో తీర్పు ఇచ్చి శిక్ష విధించాలని నిర్భయ చట్టం చెబుతుంది. మరి నిర్భయ కేసులో ఏడేళ్లు అవుతున్న శిక్ష అమలు కావడం లేదు. దిశ లాంటి ఘటనలు హృదయాలు కలిచివేస్తాయి. ఓ తండ్రిగా నేను ఆ బాధను అర్థం చేసుకోగలను అని సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.