ఉల్లి సాగుకు ప్రోత్సాహం అందించండి: మంత్రి నిరంజన్ రెడ్డి
నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ, సహకార, ఉద్యానశాఖలపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కూరగాయల సాగును పెంచాలని, ఉల్లి సాగుకు ప్రోత్సాహం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పత్తి కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించండి. సీసీఐ కొనుగోలు కేంద్రాలలో ఏ మాత్రం అవకతవకలు జరగొద్దు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
ఉల్లి పంట ప్రోత్సాహానికి ప్రభుత్వ సబ్సిడీ విత్తనం అందించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నుంచి కొనుగోలుకు ఒక ధరను నిర్ణయించాలని భావిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా కావడంతో కూరగాయలు, ఇతర నిత్యావసరాల వాడకం పెరుగుతుంది. ఎండాకాలంలో రైతులు తప్పనిసరిగా కూరగాయలు సాగుచేసేలా చూడాలి.
రైతులు వేసిన పెసరపంటను వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దారించాలి. కిచెన్ గార్డెన్ లపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రోత్సహించండి. పందిరి కూరగాయల సాగుకు సహకారం 90 శాతం సబ్సిడీతో సహకారం అందిస్తున్నాం. అర ఎకరా నుంచి ఎకరా వరకు పందిళ్లు వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నాం.
ఎరువులు, రసాయనాల వాడకంపై రైతులను చైతన్యం చేయండి. వరికి ఎకరాకు 40 కిలోల యూరియాకు మించి వాడడం వృధా, దీనిపై రైతులకు అవగాహన కల్పించండని ఆదేశించారు. అనంతరం నారాయణఖేడ్ మండలం ఆకుల లింగాపూర్ లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించి రైతులకు మద్దతుధర వచ్చేలా సహకరించాలని, తూకాలలో ఎలాంటి అవకతవకలు జరిగి రైతు నష్టపోకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు .. కొనుగోలు కేంద్రంలో పరిస్థితులపై రైతులను అడిగి తెలుసుకున్నారు.