అన్నదాతలకు అండగా అతివలు...
ఏలూరు : ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యతలు అతివలే నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు... అద్భుతమైన ఫలితాలనూ సాధిస్తున్నారు. కోట్ల రూపాయల లావాదేవీలను సమర్ధంగా నిర్వహిస్తున్నారు. మొత్తంమీద ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. స్వయం సహాయక బృందాల్లోని ఆ మహిళలు... జిల్లాలోని కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యతలను నాలుగేళ్ళ క్రితం స్వీకరించారు.
రబీ, ఖరీఫ్‌లో పండిన ధాన్యాన్ని ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తూ వచ్చారు. ఇందుకోసం... ప్రతి కేంద్రానికి ఆరుగురుతో కమిటీలు ఏర్పాటయ్యాయి. ధాన్యంలో తేమశాతం చూడటం, మరొకరు సంచులు, నగదు... ఇలా బాధ్యతలను చూస్తున్నారు. మొత్తంమీద మహిళ ప్రమేయం నేపధ్యంలో... ధాన్యం కొనుగోళ్ళకు దళారులు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు రైతులకు... మద్దతు ధర దక్కడమే కాకుండా, ఒక్క రోజులోనే చేతికి నగదు అందుతోంది. ఇక ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నందుకుగాను... మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి క్వింటాలుకు రూ. 35 చొప్పున కమీషన్ అందుతోంది. ఈ మహిళలు... 2015లో 12.5 లక్షల టన్నుల ధాన్యాన్ని, 2016లో 8.5 లక్షల టన్నులను సేకరించారు. ఇక 2017 లో 7.5 లక్షలు, 2018లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇక... కమీషన్ రూపంలో వచ్చిన ఆదాయాన్ని తమ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వినియోగిస్తున్నారు. గ్రామ మహిళా సమాఖ్య భవనాలను ఈ డబ్బుతో నిర్మిస్తుండడమే కాకుండా... కొంత డబ్బును ఆయా గ్రూపులకు సాయంగా అందిస్తూ మహిళ స్వయంశక్తికి నిదర్శనంగా నిలుస్తున్నారు. ఇక... ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న మహిళల్లో నిరక్షరాస్యులు కూడా ఉండడం విశేషం.