ఈనెల 16న నిర్భయ దోషులకు ఉరి ?..
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారైనట్లు సమాచారం. ఈనెల 16న (సోమవారం) ఉదయం 5 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తిహార్ జైలు అధికారులు తెలిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ప్రస్తుతం వారున్న తిహార్ జైలులోనే వారిని ఉరి తీయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు జైలు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాగా దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్న విషయం తెలిసిందే.
దీనిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంతో ఉరిశిక్షకు లైన్‌క్లియర్ అయ్యింది. కాగా 2012 డిసెంబర్ 16న ఆరుగురు కలిసి నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడిన డిసెంబర్ 16నే నలుగురు దోషులను ఉరి తీస్తుండటం విశేషం. దోషుల్లో ఒకరు జూవైనల్ కస్టడీలో ఉండగా.. మరో దోషి రామ్‌సింగ్ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే.
కాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ అనంతరం ప్రజల దృష్టి నిర్భయ ఘటన దోషులపైకి మళ్లిన విషయం తెలిసిందే. ఘటన జరిగి ఏడేళ్లకు పైగా గడుస్తున్నా.. దోషులకు పడిన ఉరిశిక్షను ఎందుకు అమలు చేయడంలేదని మహిళా సంఘాలతో సహా.. పలువురు ప్రముఖలూ ప్రశ్నిస్తున్నారు. శిక్ష అమలు చేయకపోవడంపై నిర్భయ తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ నిర్ణయంతో వారి డిమాండ్ నెరవేరనుంది.