https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/12/9/Srikanth-reddy1.jpg?itok=sX2t1bjZ

రాజకీయ ప్రచారంపైనే టీడీపీకి ఆసక్తి 



సాక్షి, అమరావతి: ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో 20 కీలక అంశాలపై చర్చించడానికి ప్రభుత్వమే ముందుకు వస్తే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేవలం విమర్శలు, ప్రచారానికే పరిమితమవుతోందంటూ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత అంశంపై సభలో మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే తెలుగుదేశం సభ్యులు అడ్డుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజా సమస్యలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ సొంత అజెండాతో చర్చలను అడ్డుకోవడం ద్వారా ప్రచారం పొందాలని చూస్తోందన్నారు. 

ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేరు తెచ్చుకున్నారని, చివరకు ప్రతిపక్ష పార్టీలు తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల పేర్లను కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. ప్రతిపక్షం సరైన విధానంలో వస్తే ఏ అంశంపైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో 24 కోట్ల సబ్సిడీతో కేజీ రూ.25కే అందిస్తున్నామని, దీనిమీద కూడా చర్చించడానికి సిద్ధమని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత కూడా సభను అడ్డుకోవడం ద్వారా టీడీపీ రాజకీయ డ్రామాలాడుతోందన్నారు.