https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/12/9/Vijayashanti.jpg?itok=AnSkSgnq

సీఎం జగన్‌కు విజయశాంతి అభినందనలు

సాక్షి, హైదరాబాద్‌: యావత్‌ దేశాన్ని కదిలించిన దిశ ఘటన నేపథ్యంలో అత్యాచార బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించేందుకు కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌, సినీ నటి విజయశాంతి అభినందించారు. ‘వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అమానుష దాడితో యావత్‌ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడి పడింది. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగేవిధంగా కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్టు పేర్కొన్న సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందిస్తున్నాను. ఈ కొత్త చట్టం గురించి అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా మహిళలపై అసభ్య సందేశాలు పంపే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం హర్షనీయం. మహిళల భద్రత కోసం ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను’ అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.

మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చట్టాల్లో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందని సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం ఏపీ అసెంబ్లీలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘మహిళా భద్రతపై స్వల్పకాలిక చర్చ’లో భాగంగా ముఖ్యమంత్రి సోమవారం అసెంబ్లీలో ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. రాష్ట్రంలో చిన్నపిల్లలపై జరుగుతున్న సంఘటనలతో పాటు హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’  ఉదంతం తన మనసును ఎంతో కలిచివేసిందని, తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ఓ తండ్రిగా ఆ బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల, తల్లి, చెల్లి సురక్షితంగా ఉండాలన్న ముఖ్యమంత్రి  అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మూడు వారాల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారంలో విచారణ, రెండో వారంలో ట్రయిల్‌, మూడో వారంలో శిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు.