100కు డయల్.. గర్భిణి సుఖప్రసవం
అనంతపురం : దిశ హత్యాచార ఘటన తర్వాత తెలుగు రాష్ర్టాల ప్రజలు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనతో డయల్ 100పై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఏ సంఘటన జరిగినా 100కు డయల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ప్రజలు. తమకు ఏదైనా ఇబ్బంది కలిగితే మహిళలు తక్షణమే 100కు డయల్ చేసి పోలీసుల సహాయం పొందుతున్నారు. ఓ నిండు గర్భిణి 100కు డయల్ చేసి సుఖ ప్రసవం అయ్యారు.
సోమవారం ఉదయం తొమ్మిది నెలల గర్భిణి వరలక్ష్మి(26).. కడప నుంచి కర్నూల్‌కు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరింది. అనంతపురం జిల్లా తాడిపత్రి రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. తక్షణమే ఆమె 100కు డయల్ చేసి తన బాధను పోలీసులకు వివరించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు క్షణాల్లో తాడిపత్రి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఉదయం 9:45 గంటలకు స్టేషన్‌కు రైలు చేరుకోగానే గర్భిణిని చికిత్స నిమిత్తం శ్రీసాయి లక్ష్మి నర్సింగ్ హోంకు తరలించారు పోలీసులు. వరలక్ష్మి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.