https://www.ntnews.com/updates/latestnews/2019/shacong.jpg

మతం ఆధారంగా కాంగ్రెస్సే దేశాన్ని విభ‌జించింది : అమిత్ షా

హైద‌రాబాద్‌: భార‌తదేశాన్ని మ‌తం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభ‌జించిన‌ట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇవాళ లోక్‌స‌భ‌లో పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు చ‌ర్చ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించ‌డం లేద‌న్నారు. ఇది మైనార్టీల‌కు వ్య‌తిరేకం కాద‌న్నారు. దేశ‌విభ‌జ‌న‌కు కాంగ్రెసే కార‌ణ‌మ‌న్నారు. మ‌తం ఆధారంగా దేశాన్ని కాంగ్రెస్ విభ‌జించ‌కుంటే.. ఇప్పుడు ఇలాంటి పౌర‌స‌త్వ బిల్లును తీసుకురావాల్సి వ‌చ్చేది కాద‌న్నారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు ఆర్టిక‌ల్ 11, ఆర్టిక‌ల్ 14ల‌ను ఉల్లంఘిస్తోంద‌ని విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను షా కొట్టిపారేశారు. మ‌తం ఆధారంగా ప్ర‌భుత్వం చ‌ట్టాల‌ను చేసేందుకు ఆర్టిక‌ల్ 14 అడ్డుకోద‌ని షా అన్నారు. 1971 త‌ర్వాత బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన వారికి మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ ఎలా పౌర‌స‌త్వాన్ని క‌ల్పించారో కేంద్ర మంత్రి తెలిపారు. మ‌రి అప్ప‌ట్లో పాకిస్థాన్ వారికి ఎందుకు ఆ అర్హ‌త క‌ల్పించ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఉగాండా నుంచి వచ్చిన వారికి కూడా గ‌త ప్ర‌భుత్వాలు పౌర‌స‌త్వం క‌ల్పించాయ‌న్నారు. రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన‌ప్పుడు ఆర్టిక‌ల్ 14 గుర్తుకు రాలేదా అని ఆయ‌న విప‌క్షాల‌ను ప్ర‌శ్నించారు. పాకిస్థాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌, బంగ్లాదేశ్ దేశాలు ఇస్లాం మ‌తాన్ని పాటిస్తున్నాయ‌ని, దేశ విభ‌జ‌న స‌మ‌యంలో భార‌త్‌, పాక్‌లు మైనార్టీ ర‌క్ష‌ణ కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్న‌ట్లు చెప్పారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లును లోక్‌స‌భ‌లోప్ర‌వేశ‌పెట్ట‌డానికి ఓటింగ్ జ‌రిగింది. ఆ ఓటింగ్‌లో అనుకూలంగా 293 ఓట్లు ప‌డ్డాయి, వ్య‌తిరేకంగా 82 మంది స‌భ్యులు ఓటేశారు.