https://www.ntnews.com/updates/latestnews/2019/yediyurappason1.jpg

కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

బెంగళూరు : కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5వ తేదీన ఉప ఎన్నికలు జరిగాయి. 15 అసెంబ్లీ స్థానాలకు గానూ భారతీయ జనతా పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలను కలుపుకుంటే శాసనసభలో బీజేపీ సంఖ్యా బలం 117కు చేరింది. కాంగ్రెస్‌ 68, జేడీ(ఎస్‌) 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం 112. అయితే బీజేపీకి 117 ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో సీఎం యెడియూరప్ప ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు.

ఈ ఏడాది జూలైలో 17 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్, జేడీఎస్‌లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ వారిపై అనర్హత వేటు వేశారు. దీంతో కుమారస్వామి సారథ్యంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ పతనమై.. యెడియూరప్ప ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

బీజేపీకి ఇది గొప్ప విజయం : సీఎం యెడియూరప్ప

ఉప ఎన్నికల ఫలితాల్లో 15 స్థానాలకు బీజేపీ 12 స్థానాల్లో గెలవడం తమ పార్టీకి గొప్ప విజయమని కర్ణాటక సీఎం యెడియూరప్ప స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్షం తమపై ఆరోపణలు చేయడం మానాలి. ప్రభుత్వానికి సహకరించాలి. రాబోయే మూడున్నరేండ్లు కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని యెడియూరప్ప తేల్చిచెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మంచి భవిష్యత్‌ ఉంటుందని సీఎం హామీనిచ్చారు. వీరికి ప్రభుత్వంలో ఉన్నత పదవులిచ్చే అంశంపై రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో మాట్లాడుతానని సీఎం యెడియూరప్ప పేర్కొన్నారు.