కొడుకులు, కోడళ్ల నుంచి రక్షించండి...
మహబూబాబాద్: జిల్లాలోని డోర్నకల్‌కు చెందిన దుర్గయ్య, లింగమ్మ దంపతులు ఈ రోజు ప్రజావాణిలో జేసీ డెవిడ్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కొడుకులు, కోడళ్ల నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. 70 సంవత్సరాల వయస్సున్న ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పంపకాల్లో భాగంగా వారసులకు ఆస్తులు పంచి ఇవ్వగా, తమ వద్ద ఎకరం పొలం, 500 చదరపు గజాఉన్న ఇంటిని ఉంచుకున్నారు.
ఈ క్రమంలో కుమారులు, కోడళ్లు వృద్దులను కొట్టి, బూతులు తిడుతూ ఇంటి నుంచి వెళ్లగొడ్డారు. దీనిపై డోర్నకల్ పోలీస్‌స్టేషన్‌లో, ఊరిలోని పెద్దమనుషుల వద్ద విన్నవించుకున్నా తమ సమస్య ఎవరూ పరిష్కరించడం లేదని దంపతులు వాపోయారు. పెద్దమనుషులు చెప్పినట్లు కొడుకులకు రూ.3 లక్షలు ఇచ్చినా తమను ఇంటిలో ఉండనివ్వకుండా ఆ ఇళ్లును కూల్చివేశారని మొరపెట్టుకున్నారు. వృద్ద దంపతుల ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని జేసీ డెవిడ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.