వర్మపై కేఏ పాల్ కోడలి ఫిర్యాదు!
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి సోమవారం సీసీఎస్ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి వర్మ వాడుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తాము మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి దిగిన ఫోటోను వర్మకు తాము సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్టు మార్ఫింగ్ చేసి పోస్టు చేశారని, తమ అనుమతి లేకుండా ఫొటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా ఇష్టానుసారం తమపై ప్రచారం చేస్తున్న వర్మపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. వర్మ తన ఖాతాలో పోస్టు చేసిన మార్ఫింగ్ ఫొటోను తొలగించాలని డిమాండ్ చేశారు. ఐపీసీ 469 సెక్షన్ కింద వర్మపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టు చేసిన వర్మ ఐపీ నెంబర్ కోసం ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సంస్థకు పోలీసులు లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొందరు రాజకీయ నాయకుల నేపథ్యంలో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ పేరుతో వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ వివాదాస్పద చిత్రంపై కేఏ పాల్ మండిపడుతూ.. సినిమాను విడుదల చేయొద్దంటూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే తాజాగా.. ఈ మూవీకి సెన్సార్ క్లియరెన్స్ లభించింది. దీంతో వర్మ సెన్సార్ సర్టిఫికేట్‌ను కేఏ పాల్ చేతుల మీదుగా అందుకుంటున్నట్లు ఓ మార్ఫింగ్ ఫోటోను తన ట్విటర్‌లో షేర్ చేశారు.