మహిళల భద్రతపై అసెంబ్లీలో హోం మంత్రి సుచరిత ప్రసంగం
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముందుగా అనుకున్నట్లుగానే వాడివేడిగానే జరుగుతున్నాయి. ఇవాళ సమావేశాలు ప్రారంభం నుంచే టీడీపీ-వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ప్రధానంగా విద్యుత్ ఒప్పందాలపై చర్చ జరిగింది. అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. ఆ తర్వాత తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహిళల భద్రతపై స్వల్పకాలిక చర్చ జరిగింది. హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించామని.. శాంతి భద్రతలను నివారించడంలో సహాయపడతారని మంత్రి స్పష్టం చేశారు.
మహిళల రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆత్మహత్యలు, ఒత్తిడి నిర్వహణ అంశాలపై కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరీ ముఖ్యంగా మిస్సింగ్ కేసులు, బాల్య వివాహాల నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అసెంబ్లీ వేదికగా మంత్రి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మహిళల రక్షణకోసం ‘మహిళా మిత్రభాగం’ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఈ క్రమంలో ఉల్లి ధరలు గురించి చర్చించాలంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.