https://www.ntnews.com/updates/latestnews/2019/amitshahCAB1.jpg

లోక్‌సభ ముందుకు పౌరసత్వ సవరణ బిల్లు

న్యూఢిల్లీ : జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన పౌరసత్వ(సవరణ) బిల్లును లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం ప్రవేశపెట్టారు. పౌరసత్వ సవరణ బిల్లును అమిత్‌ షా సభలో చదివి వినిపిస్తున్నారు. ఆరు దశాబ్దాల నాటి చట్టానికి సవరణ బిల్లును ప్రతిపాదించడంతో పాటు చర్చ, ఆమోదం సోమవారం నాడే పూర్తి చేయనున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు తాళలేక 2014 డిసెంబర్ నెలాఖరులోపు దేశంలోకి వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లును ప్రతిపాదించారు.

ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల నుంచి మతపీడనకు గురై అక్కడి నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం లభిస్తుంది. వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సిలు, క్రైస్తవును అక్రమ వలసదారులుగా పరిగణించరు.

ఈ బిల్లును ఈశాన్య రాష్ర్టాల ప్రజలు, సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మతాలకతీతంగా దేశంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపేందుకు 1971 మార్చి 24న తుది గడువుగా నిర్దేశిస్తూ కేంద్రం, ఈశాన్య రాష్ర్టాల మధ్య 1985లో కుదిరిన అసోం ఒప్పందం నిబంధనలను తాజా సవరణ బిల్లు నిర్వీర్యం చేయనున్నదని ఆరోపణలు ఉన్నాయి.


టీఆర్ఎస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సీపీఐ, ఈశాన్య రాష్ర్టాల ఎంపీలు, ఏఐయూడీఎఫ్ ఎంపీలు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయనున్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో ఆందోళనలు మిన్నంటాయి.