https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/12/9/mahesh-babu.jpg?itok=kCvwUril

‘సూర్యుడివో చంద్రుడివో.. ఆ ఇద్దరి కలయికవో’

మహేశ్‌ బాబు ఆర్మీ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్‌ ఉపందుకున్నాయి. డిసెంబర్‌లో ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్‌ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ‘మైండ్‌ బ్లాక్‌’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధిం రెండో సాంగ్‌ లిరికల్‌ వీడియోను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. 

‘సూర్యుడివో చంద్రుడివో.. ఆ ఇద్దరి కలయికవో’ అంటూ సాగే ఈ పాట లిరిక్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అందించగా, దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. ముఖ్యంగా మహేశ్‌, విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్టు ఈ లిరికల్‌ వీడియోను చూస్తే అర్థమవుతోంది. కుటుంబానికి మేజర్‌ అజయ్‌ కృష్ణ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తాడో తెలిపేలా ఈ సాంగ్‌ను రూపొందించినట్టుగా తెలుస్తోంది.

అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్‌కు జంటగా రష్మికా మందన్నా నటిస్తుంది. రామబ్రహ్మం సుంకర, ‘దిల్‌’ రాజు, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. విజయ్‌శాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.