https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/12/9/santosh-gangwarR.jpg?itok=oRWYICzO

కొలువులు క్షేమం..

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ చెప్పారు. నోట్ల రద్దుతో ఉద్యోగాలు కనుమరుగయ్యాయనే వాదనను తోసిపుచ్చుతూ సోమవారం లోక్‌సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రశ్నోత్తరాల సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు కళ్యాణ్‌ బెనర్జీ మాట్లాడుతూ నోట్ల రద్దుతో తన నియోజకవర్గంలో వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టిందో తెలపాలని అడగ్గా మంత్రి బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం దేశంలోని ఏ ప్రాంతానికైనా వలస వెళ్లే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని మంత్రి పేర్కొన్నారు. వలసల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం అంతరాష్ట్ర వలస కార్మిక చట్టం, 1979ను సమర్ధంగా అమలు చేస్తోందని చెప్పారు.